Montha Cyclone Damage: మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో సంభవించిన నష్టంపై సమీక్షించడానికి కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాసుమీ బసు నేతృత్వంలోని కేంద్ర బృందం సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఈ సమావేశం జరిగింది. తుపాను ప్రభావం, రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర బృందం ముఖ్యమంత్రికి వివరాలు అందించగా.. రాష్ట్రానికి అవసరమైన తక్షణ ఆర్థిక సహాయం, ఇతర అంశాలపై ప్రధానంగా చర్చించారు.
తుపాను ప్రభావిత ప్రాంతాలైన కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాలను కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో సందర్శించి నష్టాన్ని అంచనా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ఓ మధ్యంతర నివేదికను సమర్పించింది. ఆ నివేదిక ప్రకారం మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో మొత్తం రూ.5,267 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా. ఈ నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణ సాయంగా రూ.2,622 కోట్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. రాష్ట్రంలోని 443 మండలాల్లోని 3,109 గ్రామాలు ఈ తుపాను కారణంగా ప్రభావితమయ్యాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ భారీ వర్షాలు, తుఫాను కారణంగా దాదాపు 10 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 9,960 ఇళ్లు నీట మునగగా.. 1.11 లక్షల కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. అంతేకాకుండా తుపానుతో పాటు భారీ వర్షం కారణంగా 4,566 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.
తుపాను కారణంగా ప్రధానంగా వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింది. 1.61 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరగగా దీనివల్ల 3.27 లక్షల మంది రైతులు నష్టపోయారు. వ్యవసాయ పంటలతో పాటు ఆక్వా, పశుసంవర్ధకం, చేనేత రంగం కూడా తీవ్రంగా నష్టపోయినట్టు ప్రభుత్వం తన నివేదికలో వెల్లడించింది. మౌలిక సదుపాయాల విషయంలో రాష్ట్రవ్యాప్తంగా 4,794 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. మరోవైపు విద్యుత్ రంగానికి భారీ నష్టం వాటిల్లింది. ఏకంగా 12,856 విద్యుత్ స్తంభాలు నేలకూలగా, 2,318 ట్రాన్స్‌ఫార్మర్‌లు పాడయ్యాయి. పంటలు, రహదారులు, ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు మొత్తం రూ.6,384 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది.
Lionel Messi: 14 ఏళ్ల తర్వాత భారత్‌కు రానున్న ఫుట్‌బాల్ రారాజు..
తుపాను వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో 1.92 లక్షల మందిని సురక్షిత ప్రాంతాల్లోని రిలీఫ్ క్యాంపులకు తరలించినట్టు ప్రభుత్వం కేంద్ర బృందానికి వెల్లడించింది. అంతేకాకుండా 3.36 లక్షల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయంగా ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున పంపిణీ చేసినట్టు కేంద్ర బృందానికి వివరించింది. కేంద్రం నుండి తగినంత ఆర్థిక తోడ్పాటు లభిస్తే సహాయక చర్యలు మరింత వేగవంతమవుతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.