Site icon NTV Telugu

Mohsin Naqvi: బీసీసీఐకి మోసిన్‌ నఖ్వీ క్షమాపణలు.. కానీ మళ్లీ ఓ మెలిక పెట్టాడుగా!

Mohsin Naqvi Apologized

Mohsin Naqvi Apologized

ఆసియా కప్‌ 2025 ముగిసి మూడు రోజులైనా ‘ఫైనల్‌’ వేడి మాత్రం ఇంకా తగ్గలేదు. ట్రోఫీని ఇవ్వకుండా తన వద్దే పెట్టుకున్న ఏసీసీ ఛైర్మన్‌, పీసీబీ చీఫ్ మోసిన్‌ నఖ్వీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారిపోయాడు. నఖ్వీ వైఖరిపై మంగళవారం జరిగిన ఏసీసీ ఏజీఎంలో అసంతృప్తి వ్యక్తం చేసిన బీసీసీఐ.. ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకూ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నఖ్వీ వెనక్కి తగ్గాడు. ఏసీసీ భేటీలో బీసీసీఐకి క్షమాపణలు చెప్పాడు.

అయితే పీసీబీ చీఫ్ మోసిన్‌ నఖ్వీ బీసీసీఐకి క్షమాపణలు చెప్పినా.. ట్రోఫీ, మెడల్స్‌ను అందించేందుకు నిరాకరించాడు. ట్రోఫీ, మెడల్స్‌ను బీసీసీఐకి ఇవ్వకూడని నఖ్వీ మొండిగా ఉన్నట్లు తెలుస్తోంది. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దుబాయ్‌కు వచ్చి ట్రోఫీని తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఆసియా కప్ ట్రోఫీ ఉత్కంఠ కొనసాగుతున్నప్పటికీ నఖ్వీ నేడు యూఏఈ నుంచి లాహోర్‌కు బయలుదేరుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఐసీసీ జోక్యం చేసుకుని ఓ కొలిక్కి తీసుకొస్తుందో చూడాలి.

Also Read: Jubilee Hills Bye-Election: జూబ్లీహిల్స్‌ అభ్యర్థి ఎంపిక.. సీఎంతో ముగిసిన పీసీసీ చీఫ్ భేటీ!

గత ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో పాక్‌పై భారత్ గెలిచింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ వ్యక్తుల చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోమని భారత్ ప్లేయర్స్ స్పష్టం చేశారు. దాంతో ఫైనల్ అనంతరం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దాంతో ఫైనల్ వేడుక గంటకు పైగా ఆలస్యం అయింది. పీసీబీ చీఫ్ మోసిన్‌ నఖ్వీట్రోఫీ ఇచ్చేందుకు చాలా సేపు వేదికపై నిలబడి ఉన్నాడు. వ్యక్తిగత అవార్డులు తప్ప భారత ప్లేయర్స్ ఎవరూ ట్రోఫీని తీసుకోవడానికి వేదికపైకి వెళ్లలేదు. ఆ తరువాత నఖ్వీ ట్రోఫీ, మెడల్స్‌ను తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది పెద్ద వివాదానికి దారి తీసింది.

Exit mobile version