Site icon NTV Telugu

Mohan Babu: ఆ విషయం తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయా..

Mohan Babu

Mohan Babu

Mohan Babu: కలియుగ వైకుంఠం, సాక్షాత్ వెంకటేశుడు కొలువుదీరిన తిరుమలపై, అక్కడి పవిత్రతపై, స్వామివారి లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగడం అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోట్లాదిమంది హిందువులు, శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజాగా ప్రముఖ నటుడు మోహన్‌బాబు తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి హిందూ పూజించే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి అని ఆయన అన్నారు. ఆ దైవానికి నిత్యం సమర్పించే లడ్డూలలో కలిపే ఆవు నెయ్యిలో దాదాపు 3 నెలల క్రితం వరకు ఇతర జంతువుల కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయాను, తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని మోహన్‌బాబు పేర్కొన్నారు.

Read Also: Janhvi Kapoor: కరణ్ చిత్రంలో ప్రత్యేక అతిధి పాత్రలో దేవర స్టార్ జాన్వీ కపూర్

నిత్యం మా మోహన్‌బాబు విశ్వవిద్యాలయం నుంచి కనిపించే తిరుమల క్షేత్రాన్ని చూసి తనతోపాటు వేలాదిమంది ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, నిత్యం భక్తిపూర్వకంగా నమస్కరించుకుంటూ ఉంటామని ఆయన వెల్లడించారు. ఆ స్వామి దగ్గర ఇలా జరగడం ఘోరం, పాపం, ఘోరాతి ఘోరం, నికృష్టం, అతినీచం, హేయం, అరాచకమంటూ మండిపడ్డారు. ఇదేగాని నిజమైతే నేరస్థులను శిక్షించాలని ఆత్మీయుడు, మిత్రుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని మోహన్‌బాబు అన్నారు. ఈ కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు తన మిత్రుడు అందుకుని సూరేళ్ళు చల్లగా ఉండాలని మోహన్‌బాబు కోరుకున్నారు.

Exit mobile version