Site icon NTV Telugu

Mohammed Siraj Captain: కెప్టెన్‌గా మహ్మద్‌ సిరాజ్‌!

Mohammed Siraj

Mohammed Siraj

హైదరాబాద్‌ క్రికెట్‌ అభిమానులకు శుభవార్త. భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ హైదరాబాద్‌ జట్టుకు కెప్టెన్‌గా నియమితులయ్యాడు. రంజీ ట్రోఫీ 2026లో హైదరాబాద్‌ జట్టుకు అతడు సారథ్యం వహించనున్నాడు. ముంబై, చత్తీస్‌గఢ్‌లతో జరిగే రంజీ మ్యాచ్‌లకు సిరాజ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) తెలిపింది. 15 మందితో కూడిన హైదరాబాద్‌ జట్టును బుధవారం సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది.

ఇప్పటికే టీమిండియాలో కీలక పేసర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహ్మద్ సిరాజ్‌.. ఇప్పుడు నాయకత్వ పాత్రలోకి అడుగుపెట్టాడు. తన అనుభవం, క్రమశిక్షణ, పోరాట తత్వంతో హైదరాబాద్‌ జట్టును విజయపథంలో నడిపిస్తాడని హెచ్‌సీఏ సెలెక్టర్లు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యువ ఆటగాళ్లకు సిరాజ్‌ నాయకత్వం ఎంతో ఉపయోగపడుతుందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

హైదరాబాద్‌ తరఫున మహ్మద్ సిరాజ్‌ గతంలో కీలక మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఇప్పుడు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడంతో.. ఆటతో పాటు వ్యూహాత్మక నిర్ణయాల్లోనూ తన సత్తా చాటే అవకాశం వచ్చింది. బౌలింగ్ యూనిట్‌ను సమర్థంగా నడిపిస్తూ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో ఆయన పాత్ర కీలకంగా ఉండనుంది. మొత్తానికి హైదరాబాద్‌ కెప్టెన్‌గా సిరాజ్‌ నియామకం జట్టుకు కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. రానున్న దేశవాళీ సీజన్‌లో హైదరాబాద్‌ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

Also Read: NTV journalists: సీసీఎస్ పోలీసుల హైడ్రామాకు తెర.. జర్నలిస్టులు దొంతు రమేష్, సుధీర్‌కు బెయిల్!

హైదరాబాద్‌ జట్టు:
మహ్మద్ సిరాజ్‌ (కెప్టెన్‌), రాహుల్‌ సింగ్‌ (వైస్‌ కెప్టెన్‌), సివి మిలింద్, తనయ్‌ త్యాగరాజన్, రోహిత్‌ రాయుడు, హిమతేజ, వరుణ్‌ గౌడ్, అభిరథ్‌ రెడ్డి, రాహుల్‌ రాదేశ్‌ (కీపర్‌), అమన్‌రావు పేరాల, రక్షణ్‌ రెడ్డి, నితిన్‌ సాయియాదవ్, నితేష్‌ రెడ్డి, సాయి ప్రజ్ఞయ్‌ రెడ్డి (కీపర్‌), పున్నయ్య.
స్టాండ్‌బై ప్లేయర్స్: మికిల్‌ జైశ్వాల్, అవినాష్‌ రావు (కీపర్‌), కార్తికేయ, ప్రణవ్‌ వర్మ, నితీశ్‌ రెడ్డి.

Exit mobile version