సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆయా వర్గాలకు తాయిలాలు ప్రకటించింది. కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే సోలార్ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కేబినెట్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
అలాగే అన్నదాతలకు కూడా శుభవార్త తెలిపింది. ఎరువుల రాయితీకి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2024 ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల రాయితీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఐదు రకాల ఎరువులపై రూ.24,420 కోట్ల రాయితీకి ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఎరువుల రాయితీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
కేబినెట్ భేటీ తర్వాత కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడారు. 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో ఆయా కుటుంబాలకు సహాయంగా ఉంటుందని తెలిపారు. ఈ పథకం కింద నివాస పైకప్పు సౌర సంస్థాపనలకు కేంద్ర ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. మిగులు విద్యుత్‌ను డిస్కమ్‌లకు విక్రయించడం ద్వారా గృహాలు తమ విద్యుత్ బిల్లులను ఆదా చేసుకోవచ్చని, అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చని ప్రభుత్వం పేర్కొంది. 3 KW వ్యవస్థ ఒక గృహానికి సగటున నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ ఉత్పత్తి చేయగలదని ఆయన పేర్కొన్నారు.