MLC Vamshikrishna: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మౌనంగా ఉన్న నేతలు ఇప్పుడు అసంతృప్తి గళం విప్పుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా వైఎస్సార్‌సీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఎమ్మెల్యీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖలో మారుతున్న రాజకీయ పరిణామాలు , వచ్చే ఎన్నికలు, అనంతర రాజకీయాల్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రేపు కాకినాడకు వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఆయన భేటీ కాబోతున్నట్లు సమాచారం. తన వర్గం కార్పొరేటర్లతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. పవన్ తో భేటీ తర్వాత వంశీకృష్ణ జనసేన పార్టీలో చేరే అవకాశాలున్నాయి. దీంతో వైజాగ్ వైసీపీలో కలకలం రేగింది.
Read Also: Breaking: పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీపై జీవో విడుదల చేసిన ప్రభుత్వం
గతంలో గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో కార్పోరేటర్‌గా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ జీవీఎంసీ మేయర్ పదవిని ఆశించారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు బదులుగా హరికుమారికి అవకాశం కల్పించారు. అప్పటి నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయనకు గతేడాది ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్ధానిక సంస్ధల కోటాలో వైజాగ్ నుంచి అవకాశం కల్పించారు. ఈ ఎన్నికల్లో సునాయాసంగా గెలిచి ఎమ్మెల్సీ అయిన వంశీకృష్ణ.. మండలి సభ్యుడిగా ఉన్నారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ మార్పు వ్యవహారంపై స్ధానిక మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఆయన పార్టీ మారుతున్న సమాచారం నా దగ్గర లేదని మంత్రి అమర్‌నాథ్ వెల్లడించారు. పార్టీ ఆయనకు చాలా అవకాశాలు ఇచ్చిందని.. ఎమ్మెల్సీ పార్టీ మారితే రాజకీయంగా ఆత్మహత్య సదృశ్యమే అవుతుందన్నారు.