NTV Telugu Site icon

MLC Vamsi Krishna: అందుకే వైసీపీ నుంచి జనసేనలో చేరా..

Vamsi Krishna

Vamsi Krishna

MLC Vamsi Krishna: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. అయితే, వైసీపీ నుంచి వంశీ కృష్ణపై విమర్శలు పెరిగాయి.. దీంతో.. వాటికి ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రత్యక్ష రాజకీయాల్లో వుండడం కోసమే నేను వైసీపీ నుంచి జనసేనలో చేరాను అన్నారు. తాను రాజకీయాల కోసం 60 ఎకరాలు భూమి, 10 సైట్ లు అమ్ముకున్నాను.. వైసీపీలో బీసీలకు న్యాయం జరిగితే నేను ఎందుకు పార్టీ మారతాను అని ప్రశ్నించారు. గుడివాడ అమర్నాథ్ జాక్‌పాట్‌ కొట్టి మంత్రి అయ్యాడు అని ఎద్దేవా చేశారు.. తనపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు.. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది అంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

Read Also: Jyothula Chanti Babu: పవన్‌ కల్యాణ్‌ పిలిస్తే వెళ్లా.. ఇక్కడ టీడీపీ-జనసేన కలిసి పనిచేసే పరిస్థితి లేదు

నా రాజకీయ భవిష్యత్తు నాశనం కావడానికి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కారణం అన్నారు ఎమ్మెల్సీ వంశీకృష్ణ.. వచ్చే ఎన్నికల్లో ఎంవీవీని ఓడించడమే నా లక్ష్యం అన్నారు. సంక్రాంతి పండుగ తరువాత నా సత్తా చూపిస్తాను అంటూ సవాల్ చేశారు. రాష్ట్రంలో నాకు చాలా మంది ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీలతో సంబంధాలు వున్నాయి.. వైసీపీ పార్టీ నుండి చాలా మందిని తీసుకుపోతాను అని ప్రకటించారు. టీడీపీలో ఉన్నప్పుడు విడదల రజనీ.. వైఎస్‌ జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు మనుషులను పెట్టి కొట్టించేద్దాం అనుకున్నాను.. అటువంటి ఆమెకు మంత్రి పదవి ఇచ్చారని ఫైర్‌ అయ్యారు.. జగన్ సలహాదారులుగా పెట్టుకున్న వాళ్లే పార్టీని ముంచేస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్‌ చెప్తే ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేయడానికి సిద్దం.. ప్రస్తుతం రాజీనామా చెయ్యొద్దని అధినేత చెప్పారని వెల్లడించారు ఎమ్మెల్సీ వంశీ కృష్ణ.