మాజీ సీఎం కేసీఆర్ వీరాభిమాని, దివ్యాంగుడైన చిర్రా సతీశ్ జిరాక్స్ సెంటర్‌ను ఎమ్మెల్సీ కవిత సోమవారం ప్రారంభించారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగుడైన సతీశ్‌కు ఆర్థికంగా చేయూతనందించిన కవిత.. నేడు ‘కేసీఆర్’ ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్‌ను ఆరంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ రవీందర్ రావు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, మాజీ ఎంపీ మలోత్ కవిత పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రామానుజపురం గ్రామానికి చెందిన ఉద్యమ కారుడు చిర్ర లింగన్న కుమారుడు సతీష్. సతీశ్‌కు చిన్నప్పటి నుంచి కేసీఆర్ అంటే ప్రాణం. 2001లో టీఆర్‌ఎస్ స్థాపించిన నాటి నుంచి కార్యకర్తగా ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఆర్థిక ఇబ్బందులు, అంగవైకల్యాన్ని ఎదిరించిన సతీష్ డిగ్రీ పూర్తి చేశారు. బీఆర్‌ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. 2025 ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. ఇంటర్నెట్ సెంటర్ ద్వారా తనకు స్వయం ఉపాధికి కల్పించాలని ఎమ్మెల్పీ కవితకు విజ్ఞప్తి చేశారు. సతీష్ విజ్ఞప్తికి కవిత వెంటనే స్పందించి.. సాయం చేస్తానని హామీ ఇచ్చారు. వారం రోజుల్లోనే సొంతం ఖర్చులతో ఇంటర్నెట్ సెంటర్‌ను ఏర్పాటు చేయించారు. ఈ ఇంటర్నెట్ సెంటర్‌కు కేసీఆర్ పేరును సతీశ్ పెట్టుకున్నాడు. జిల్లా పర్యటనలో భాగంగా నేడు ‘కేసీఆర్’ ఇంటర్నెట్ సెంటర్‌ను ప్రారంభించారు.
Also Read: Liquor Shops: తెలంగాణలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్!
ఇంటర్నెట్ సెంటర్ ఏర్పాటుపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ‘కార్యకర్తలే పార్టీకి ఆయువుపట్టు. కార్యకర్తలకు అండగా ఉండడం కేసీఆర్ గారు మనకు నేర్పిన బాధ్యత. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, కేసీఆర్ గారి వీరాభిమాని చిర్రా సతీష్ గారికి స్వయం ఉపాధి కల్పించడం నా బాధ్యతగానే భావించా. కార్యకర్తలు, వారి కుటుంబాలకు అన్ని రకాల మద్దతు ఇవ్వడంలో ముందుండే ఏకైక పార్టీ బీఆర్ఎస్. సతీష్ కేసీఆర్ ఇంటర్నెట్-జిరాక్స్ సెంటర్‌ను ప్రారంభించే అవకాశం నాకు కలగడం సంతోషంగా ఉంది’ అని కవిత పేర్కొన్నారు. తనకు ఇంత పెద్ద సాయం చేసిన కవితకు సతీష్ కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్, కవితలకు తన కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుందని చెప్పుకొచ్చాడు.