MLC Elections 2025: నేడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్‌!

  • ఎమ్మెల్సీ ఎన్నికలకు నాగబాబు నామినేషన్‌
  • నామినేషన్‌ దాఖలుకు అవసరమైన పత్రాలు సిద్ధం
  • నామినేషన్‌లకు మార్చి 10 చివరి గడువు
Nagababu Mlc Elections 2025

Nagababu Mlc Elections 2025

ఎమ్మెల్యే కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈరోజు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు నామినేషన్‌ వేయనున్నారు. కూటమి పార్టీల్లో భాగంగా జనసేన అభ్యర్థిగా నాగబాబు శుక్రవారం ఉదయం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలకు అనుగుణంగా నామినేషన్‌ దాఖలుకు అవసరమైన పత్రాలను పార్టీ కార్యాలయం ఇప్పటికే సిద్ధం చేసింది.

కొణిదెల నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ జనసేన పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రమే సంతకాలు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్‌ స్వయంగా ఈ బాధ్యతను తీసుకొన్నారు. ఎమ్మెల్యేలు మండలి బుద్ధ ప్రసాద్, ఆరణి శ్రీనివాసులు, లోకం నాగ మాధవి, పంచకర్ల రమేష్‌ బాబు, పత్సమట్ల ధర్మరాజు, సుందరపు విజయ్‌ కుమార్, అరవ శ్రీధర్, పంతం నానాజీ, బత్తుల బలరామకృష్ణలు సంతకాలు చేశారు. ఎమ్మెల్యేలతో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్‌ కూడా సంతకం చేశారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్‌లకు మార్చి 10 చివరి గడువు. ప్రభుత్వ సెలవు రోజులు మినహాయించి.. మిగిలిన ఏ రోజైనా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ శాసనసభ భవనంలో నామినేషన్‌లను స్వీకరిస్తారు. మార్చి 11న ఉదయం 11 గంటలకు నామినేషన్‌ల పరిశీలన, మార్చి 13న మధ్యాహ్నం 3 గంటల్లోపు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.