తెలంగాణ అభివృద్ధికి బీజేపీకి ఓటు వేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము మూడు స్థానాల్లో గెలుస్తున్నాం అని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాటను తెలంగాణ ప్రజలు వినాలని, అయన పనితీరు ఆధారంగానే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు సీఎం మాపై విమర్శలు చేస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాట్లాడినట్టు.. ఇప్పుడు మాట్లాడితే ఓట్లు పడతాయని సీఎం అనుకుంటున్నాడని విమర్శించారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని కిషన్ రెడ్డి చెప్పారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ‘కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పార్టీకి పాలసీ ఉంటే.. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గానీ, ఆ పార్టీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన ఎందుకు చేయడం లేదు. రేవంత్ రెడ్డి మాటను తెలంగాణ ప్రజలు వినాలి, అయన పనితీరు ఆధారంగానే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. దొంగనే.. దొంగ దొంగ అన్నట్టు ఉంది రేవంత్ వ్యవహారం. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మాపై విమర్శలు చేస్తున్నారు. చేతనైతే సీఎంగా పని చెయ్యి.. అనవసరంగా బురద చల్లకు. రీజనల్ రింగ్ రోడ్డు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్.. మధ్యలో నివేంది రేవంత్. అసెంబ్లీ ఎన్నికల్లో మాట్లాడినట్టు ఇప్పుడు మాట్లాడితే ఓట్లు పడతాయి అని అనుకుంటున్నాడు’ అని అన్నారు.
‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సీఎం జైల్లో పెడతా అన్నాడు.. ఒక్క మంత్రి మీద, కేసీఆర్ కుటుంబం మీద చర్య తీసుకోలేదు. నీచ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు రేవంత్. నేనే పెద్ద హీరో అన్నట్టు రేవంత్ మాట్లాడుతున్నారు. బీసీలకు న్యాయం జరగాలి అని, బీసీ రిజర్వేషన్లను పెంచాలి. కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం సంతొషంగా లేదు.. కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది. తెలంగాణ అభివృద్ధికి బీజేపీకి ఓటు వేయాలి. మేము పోరాటం చేశాము కాబట్టే మూడు స్థానాల్లో పోటీ చేస్తున్నాం, మూడు స్థానాల్లో గెలుస్తున్నాం’ అని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.