తప్పుడు కేసులు పెట్టి హింసించాలనుకుంటే.. రెట్టింపు ఫలితాలు అనుభవించాల్సి వస్తుందని శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరించారు. తాము మరలా అధికారంలోకి వస్తాం అని, సేమ్ ట్రీట్మెంట్ ఇస్తాం స్పష్టంగా చెప్తున్నా అన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన, టీడీపీ నాయకులు పెట్టిన కేసులు దువ్వాడ శ్రీనివాసను అదిరించలేవు, బెదిరించలేవని ఎద్దేవా చేశారు. వైసీపీ పార్టీ కార్యకర్తలను సోషల్ మీడియా కేసుల పేరిట వేధిస్తున్నారన్నారు. అధికారమనేది తాత్కాలికం అని, తప్పుడు కేసులు పెట్టి హింసించాలనుకుంటే ప్రజలు చూస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నేడు పోలీసుల విచారణకు హాజరయ్యారు. వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారంటూ.. టెక్కలి జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి కణితి కిరణ్ నవంబర్ 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. డిసెంబర్ 13న దువ్వాడకు 41ఏ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే దువ్వాడ పోలీసుల విచారణకు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
‘కూటమి ప్రభుత్వంలో జనసేన, టీడీపీ నాయకులు పెట్టిన కేసులు దువ్వాడ శ్రీనివాసను అదిరించలేవు, బెదిరించలేవు. రాష్ట్రమంత్రి కింజరాపుచ్చున్నాయుడు తప్పుడు కేసులు పెట్టి హింసించాలనుకుంటే.. రెట్టింపు ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది. మేము మరలా అధికారంలోకి వస్తాం, సేమ్ ట్రీట్మెంట్ ఇస్తాం అని స్పష్టంగా చెప్తున్నా. జనసేన పార్టీ కార్యకర్తకు ఉన్న విలువ ప్రజాప్రతినిధికి లేదు. జనసేన కార్యకర్తలు కేసు పెడితే ఎమ్మెల్సీని పోలీస్ స్టేషన్ తీసుకువచ్చారు. నేను ఫిర్యాదు చేస్తే కనీసం పోలీసులు స్పందించలేదు. ప్రజా ప్రతినిధిగా నా పోరాటమాగదు. ఎలాంటి పరిస్థితులైనాఎదుర్కొనేందుకు సిద్ధం. మమ్మల్ని ఏదైనా చేయాలనుకుంటే.. మీరు ఏ ఏక్షన్ తీసుకున్నా దానికి నేను రెడీ. ఏడాది కాలంలో సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేకపోయారు. కానీ వైసీపీ పార్టీ కార్యకర్తలను సోషల్ మీడియా కేసుల పేరిట వేధిస్తున్నారు. అధికారమనేది తాత్కాలికం. తప్పుడు కేసులు పెట్టి హింసించాలనుకుంటే ప్రజలు చూస్తున్నారు. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జనసేన, టీడీపీ నాయకులను హెచ్చరిస్తున్నా’ అని దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరించారు.