బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక భూ అక్రమాలు జరిగాయన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ తో పాటు హైదరాబాద్ చుట్టూ ఓ ఎమ్మెల్సీ వందల ఎకరాలు కబ్జా చేశారని కథనాలు వచ్చాయన్నారు. దీనిపై కేటీఆర్, హరీశ్ రావు స్పందించలేదని ఆయన అన్నారు. ఇలాంటి వారిని పెద్దల సభకు పంపి ప్రజాస్వామ్యంను అపహాస్యం చేసిందని విజయ రమణారావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులు గడవకముందే ఏమీ చేయలేదని బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం సరికాదని ఆయన మండిపడ్డారు. భూకబ్జా గురించి కేటీఆర్ సమాధానం చెప్పాలని, శంబిపూర్ రాజు కేటీఆర్ బినామీ అని ఆయన వ్యాఖ్యానించారు. కుత్బుల్లాపూర్ లో ఉండేది శంబిపూర్ రాజు అని, గతంలో ఎమ్మెల్సీ కబ్జాల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కారన్నారు. భూకబ్జాలు చేసిన దొంగల భరతం పడతారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవర్ని వదిలిపెట్టరన్నారు. ధరణిలో పేరు మార్చి వందల ఎకరాల భూములు దోచుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
అనంతరం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. భూకబ్జాలపై బీఆర్ఎస్ నేతలు సమగ్ర విచారణకు సిద్ధమా? ఎవరెవరి ఆస్తులు ఎంతో కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. పదేళ్ల పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని ఆయన సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం 10 కోట్లు కేటాయించారు. పారదర్శక పాలనకు ఇదే నిదర్శనమన్నారు. గత ప్రభుత్వంలో పోలీసుల పోస్టింగ్ కోసం కూడా డబ్బులు తీసుకున్న చరిత్ర బీఆర్ఎస్ నేతలదని, మంచిర్యాల ఎమ్మెల్యే ధనవంతుడు, వ్యాపారవేత్త. ఆయనకు కబ్జా చేయాల్సిన అవసరం లేదన్నారు.