NTV Telugu Site icon

MLA Medipally Sathyam: కేసీఆర్ రాములవారిని అవమానించారు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

Mla Medipally Sathyam

Mla Medipally Sathyam

MLA Medipally Sathyam: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మీడియా వేదికగా మాట్లాడారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. నిన్న తెలంగాణ ప్రజలు రెండు అపురూప దృశ్యాలు చూశారని వ్యాఖ్యానించారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కన్నులపండువగా అత్యంత వైభవంగా జరిగిందని.. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా లో రేవంత్ రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారని తెలిపారు. గత పదేళ్లుగా ఈ దృశ్యం కోసం తెలంగాణ ప్రజలు, రామభక్తులు ఎదురు చూస్తున్నాట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది ముఖ్యమంత్రి దంపతులు అత్యంత భక్తి , విశ్వాసాలతో రాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారని.. దక్షిణ అయోధ్యగా పిలుచుకునే భద్రాచలాన్ని గత పదేళ్లలో కేసీఆర్ పూర్తిగా నిర్లక్ష్యం చేసాడని విస్మరించారు. కేసీఆర్ తన మనవడు హిమాన్షుతో పట్టు వస్త్రాలు పంపించి భద్రాచలం రాములవారిని అవమానించారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ చర్యలతో రామ భక్తులు ఎంతో మనోవేదనకు గురయ్యారని, కేసీఆర్ కు తెలంగాణ ప్రజలంటే లెక్క లేదు.. చివరకు దేవుళ్ల విషయంలో కూడా ఆయన తీరు అలాగే ఉందని అన్నారు. అలాగే కేసీఆర్ ఒక నియంత, ఆయన అహంకారపూరిత వైఖరిని ప్రజలు గమనించాలని.. మా ముఖ్యమంత్రి ప్రజా పాలనను, తెలంగాణ విశ్వాసాల పట్ల నిబద్ధతను ప్రజలు గమనించాలని ఆయన అన్నారు.  
Read Also: Digvesh Rathi: అందుకే ‘నోట్‌బుక్’ సెలబ్రేషన్స్ చేసుకున్నా.. వీడియో వైరల్!

అలాగే తెలంగాణలో నిన్న మరో అపురూప దృశ్యాన్ని ప్రజలు చూశారన్నారు. సారపాకలో అత్యంత నిరుపేద ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యంతో భోజనం చేశారని.. ముఖ్యమంత్రిగా ఉండి అత్యంత సామాన్యుడిగా ఆ కుటుంబంతో కలిసి పోయి భోజనం చేసిన తీరును తెలంగాణ ప్రజలు ఎప్పటికి గుర్తు పెట్టుకుంటారని అన్నారు. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత చారిత్రాత్మక ఘటనగా ఆయన అభి వర్ణించారు. పేదోడి కంచంలో సన్న బియ్యం బువ్వ ఉండాలన్న గొప్ప ఆశయంతో ముఖ్యమంత్రి ఈ స్కీం తీసుకువచ్చారని, తెలంగాణ లోని రేషన్ కార్డు దారులంతా సంతోషంతో రేషన్ షాపుల ముందు క్యూ కట్టి బియ్యం తీసుకుంటున్నారని తెలిపారు.

మార్పు అంటే ఇది.. ప్రజా పాలన, పేదల పాలన అంటే ఇది.. అని చెబుతూనే, పదేళ్లలో ప్రగతి భవన్ అనే గడీలో వెండి పళ్లెంలో పంక్ష భక్ష్య పరమాన్నం తిన్నారే తప్ప పేదల బువ్వ గురించి ఆలోచించలేదని అన్నారు. పేదలతో కూర్చుని తినడానికి కూడా ఏ నాడు ఇష్టపడలేదని, ఇదే రేవంత్ రెడ్డికి, కేసీఆర్ కు ఉన్న తేడా ఇదే.. అంటూ పేర్కొన్నారు.  సన్న బియ్యం ఇవ్వాలన్న ఆలోచన కూడా కేసీఆర్ పదేళ్లలో చేయలేదని, ప్రభుత్వం  ఏం చేసినా రాద్ధాంతం చేసే కేటీఆర్, హరీష్ రావు  సన్న బియ్యం పైన కిక్కురుమనడం లేదని అన్నారు. సన్న బియ్యం పథకం పైన బీఆర్ఎస్ నేతలు స్పందించాలని.. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించాలని ఆయన అన్నారు. 

అలాగే సన్న బియ్యం పైన బీఆర్ఎస్ మీడియాలో దుష్ప్రచారం మొదలు పెట్టారని, పేదోడి అన్నంలో మట్టి పోయాలని చూస్తే పాతర వేస్తాం జాగ్రత్త అంటూ హెచ్చరికలు చేసారు. పేద ప్రజల బతుకులను అవమానిస్తున్నారని, సన్న బియ్యం పైన కుట్రలు చేస్తున్నారని.. అభినందించక పోయినా పర్వాలేదు.. అవమానిస్తే మాత్రం తాట తీస్తామంటూ గట్టిగానే హెచ్చరించారు. సన్న బియ్యం పైన బీజేపీ నాయకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, మోడి సొంత రాష్ట్రం గుజరాత్ లో సన్న బియ్యం ఇస్తున్నారా..? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా సన్న బియ్యం ఇస్తున్నారా..? అంటూ ప్రశ్నించారు. విద్యా వ్యవస్థలో  మైలురాయిలా నిలిచేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, 12 యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేయడాన్ని ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. యూనివర్సిటీ పుననిర్మాణానికి మరో అడుగు వేసినట్లు అయిందని, యూనివర్సిటీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాసటగా నిలబడాలని ఆయన అన్నారు. పేదోడి విద్యకు కేసీఆర్ యముడిలా నిలిచాడని, గత ప్రభుత్వం యూనివర్సిటీ జీతాలకు చేతులు చాపేలా చేసిందిని ఆయన హాట్ కామెంట్స్ చేసారు.