తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా ఉన్న చోట పోటీ చేస్తాం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తే ముందుకూ వెళ్తామని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నాం అని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల అభ్యర్ధుల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై చర్చిస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన చేయడాన్ని తాను స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి పోకడకు వెళ్లకుండా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులను ఎన్ కౌంటర్ పేరుతో చంపేస్తున్నారని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని ఎమ్మెల్యే కూనంనేని కోరారు.
‘కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులను కలుపుకోవడంలో వైఫల్యం చెందింది. సమన్వయం చేసుకోవడంలో విఫలమైంది. కమ్యూనిస్టు పార్టీల కలయికతోనే గెలిచిందని మర్చిపోతున్నారు. దేశవ్యాప్తంగా అనేక పరిణామాలు చూస్తున్నారు కానీ.. కలుపుకోవడం తెలియడం లేదు. మావోయిస్టులను అంతం చేసేందుకు మార్చి నెలలో ముహూర్తం పెట్టారు. ముహూర్తాలు ఎవరు పెడతారు.. ఎందుకు పెడుతారు?. రాజ్యాంగాన్ని కాలరాసే విధంగా మావోయిస్టులను మట్టుపెట్టడానికి ముహూర్తాలు పెట్టడం ఏమిటి?. మావోయిస్టులు సంఘవిద్రోహ కార్యక్రమాలు చేస్తున్నారు.. సంఘవిద్రోహులేమో అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉంటారు. ప్రజలకోసం పనిచేసే మావోయిస్టులను చంపేస్తారా?. అమిత్ షా హత్యలు చేస్తున్నట్టే.. అతనిపై విచారణ చెయ్యాలి’ అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు పేర్కొన్నారు.
‘ కులగణన అధికారంగా ప్రకటించారు, అందుకు సంతోషం. దానిని మేము అంగీకరించాం. బీసీలు తగ్గారు అంటున్నారు.. గ్రామ సభల్లో పెట్టాలి ఈ అంశాన్ని. ఎస్సీ కులగణనలో చిన్న చిన్న లోపాలున్నాయి, వాటిని రీ వెరిఫై చెయ్యాలి. ఆర్టీసీ కార్మికులు సమ్మె దిశగా ఆలోచనలు చేస్తున్నారు. వాళ్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు బలం ఉన్నచోట పోటీ చేస్తాం. కుదిరిన చోట కాంగ్రెస్ పార్టీతో కలుపుకుపోతం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నాం. టీచర్ ఎమ్మెల్సీలకు ఇంకా చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చేసినవి చెప్పుకోవడం చేత కావడం లేదు. 22 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసినా కూడా చెప్పుకోవడం లేదు. రైతు భరోసా వేస్తున్నారు. మోడల్ విలేజీస్లో ఇల్లు కట్టిస్తున్నారు. రుణమాఫీ 2 లక్షల విషయంలో కొంత వైఫల్యం చెందారు. కొన్ని అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తుంది. కానీ చేసినవి చెప్పుకోవడంలో ఫెయిల్ అయింది. ప్రభుత్వంలో ఎవ్వరు ఫోన్ కాల్స్ అటెండ్ చెయ్యడం లేదు. ప్రభుత్వం దీన్ని గమనించాలి’ అని ఎమ్మెల్యే కూనంనేని సూచించారు.