Kapu Ramachandra Reddy: ఏ పార్టీ నుంచైనా పోటీకి సిద్ధంగా ఉన్నాను.. నేను కళ్యాణదుర్గం అసెంబ్లీ స్థానం నుంచి.. నా కుటుంబ సభ్యులు రాయదుర్గం స్థానం నుంచి పోటీ చేస్తామని ప్రకటించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.. ఈ రోజు రాయదుర్గంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాయదుర్గం నియోజకవర్గంలో నాకు తోడుగా ఉన్న కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటానన్నారు. ఈ సారి ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుండి పోటీ చేస్తున్నాను. నా కుటుంబ సభ్యులు రాయదుర్గం నుండి పోటీ చేస్తారని తెలిపారు. అయితే.. ఏ పార్టీ నుంచి అవకాశం ఇచ్చిన నేను పోటీ చేయడానికి రెడీగా ఉన్నాను అన్నారు. కానీ, సోషల్ మీడియాలో టికెట్ వస్తుంది అనే అభ్యర్థులు నాపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నా కార్యకర్తల పైన బెదిరింపు ధోరణితో దుష్ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
Read Also: Rohit Sharma: మరో 44 పరుగులు.. టీ20ల్లో చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ!
కాగా, ఇటీవలే వైసీపీ అధిష్టానంపై ధిక్కార సర్వం వినిపించారు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.. తనకు సీటు ఇవ్వకపోవడంపై ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర ఇటీవలే ఆవేదన వ్యక్తం చేశారు. మీకు గుడ్ బై అంటూ సీఎం క్యాంపు కార్యాలయానికి సెల్యూట్ చేసి వెళ్లిపోయారు.. అంతే కాదు వైఎస్ జగన్‌ని నమ్ముకుని వచ్చినందుకు తమ జీవితాలు నాశనం అయ్యాం.. జగన్‌ను నమ్మి ఆ కుటుంబం వెంట నడిచాం.. ఇప్పుడు తమకు అన్యాయం చేశారని మండిపడిన విషయం విదితమే. మరోవైపు.. నిన్న మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డిని కలిసిన రామచంద్రారెడ్డి.. రెండు గంటల పాటు సుదీర్ఘ మంతనాలు జరిపారు.. మడకశిర మండలం నీలకంఠాపురంలోని రఘువీరా నివాసంలో రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి భారతి, కోడలు అలేఖ్య కలిసి చర్చించారు. దీంతో, కాంగ్రెస్ పార్టీలో చేరతారా? అనే ప్రచారం సాగింది.. ఇక, ఈ రోజు మీడియా సమావేశంలో దానిపై క్లారిటీ వస్తుందని అంతా భావించినా.. రెండు స్థానాల నుంచి పోటీ చేస్తామన్న ప్రకటనకే పరిమితం అయ్యారు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. మరి.. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనేది క్లారిటీ రావాల్సి ఉంది.