రైతులు నీటిని సద్వినియోగం చేసుకొని తదనుగుణంగా పంటలు వేసుకోవాలని యల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ కోరారు. ఆదివారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం పోచారం ఆనకట్ట నుంచి కాలువకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు సాగునీటి కోసం నీటిని న్యాయంగా వినియోగించుకోవడం వల్ల వారి ఆదాయాలు పెరుగుతాయన్నారు. ఈ ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీటిని చెరువులు నింపి వానాకాలం సీజన్‌లో రైతుల సాగుకు ఉపకరిస్తామన్నారు. “నీటిని న్యాయబద్ధంగా ఉపయోగించడం వల్ల రైతులు చాలా నీటిని ఆదా చేయడంలో సహాయపడుతుంది, ఇది రెండవ పంటకు కూడా ఉపయోగపడుతుంది” అని ఆయన వెల్లడించారు.
Also Read : Vaikuntha Ekadasi 2023: వైకుంఠ ఏకాదశి సందర్భంగా “శ్రీ తిరుపతి వెంటేశ్వర కళ్యాణం” ప్రత్యేక ప్రదర్శన
పోచారం ఆనకట్ట నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల ప్రజలకు సాగునీరు, తాగునీరు రెండింటికీ సరిపడా నీరు అందజేస్తున్నదని సురేందర్ అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు భారతదేశంలో ఎక్కడ లేవని కొనియాడారు. తెలంగాణలో ఉన్న పథకాలు బీజేపీ పాలిత మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో లేవన్నారు. తెలంగాణ అభివృద్ధి చూసి కేంద్రంలోని మోడీ సర్కార్ ఓర్వలేకపోతుందన్నారు. దేశంలో బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే అడుగులు వేస్తోందన్నారు. తెలంగాణ పథకాలు దేశానికే మార్గదర్శకాలుగా ఉన్నాయన్నారు. గల్లీలో తిట్టుకుంటా.. ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నారన్నారు.