MLA Arava Sridhar Controversy: రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం మరోసారి సంచలనంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించి బాధితురాలిగా పేర్కొంటున్న మహిళా ఉద్యోగి తాజాగా మరో సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో ఆమె తన ఆవేదనను వ్యక్తం చేస్తూ రాజకీయ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది.
తన వ్యక్తిగత విషయాన్ని రాజకీయంగా మలచి జనసేన పార్టీకి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రతిష్ఠకు నష్టం కలిగించే ప్రయత్నం జరుగుతోందని ఆమె అన్నారు. “రాజకీయం చేయొద్దు.. పవన్ కళ్యాణ్ పేరు చెడగొట్టొద్దు” అంటూ ఆమె స్పష్టంగా తెలిపింది. ఇప్పటికే తన పరువు, శరీరం అన్నీ కోల్పోయానని.. ఇప్పుడు దీన్ని ఆపకపోతే ఇంకా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. విచారణ జరిగితే నిజాలు బయటకు వస్తాయని ఆమె స్పష్టం చేసింది. తన సెల్ ఫోన్‌తో పాటు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సెల్ ఫోన్‌ను పరిశీలిస్తే అసలు వాస్తవాలు ఏమిటో అందరికీ తెలుస్తాయని తెలిపింది. మా ఫోన్లే నిజం చెబుతాయంటూ ఆమె వ్యాఖ్యానించింది.
తనకు ఎమ్మెల్యేకు మధ్య జరిగిన విషయాన్ని వదిలేసి.. ఇతర అంశాలను ఎందుకు ప్రస్తావిస్తున్నారని ఆమె ఈ వీడియోలో ప్రశ్నించింది. ఈ వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా మార్చుతున్నారని ఆరోపించింది. తాను పరారీలో ఉన్నానంటూ దుష్ప్రచారం చేస్తున్నారని.. నిజానికి తన వద్ద ఒకటే సెల్ ఫోన్ ఉందని, అది ఆన్ లోనే ఉందని, యూపీఐ పేమెంట్స్ కూడా చేస్తూనే ఉన్నానని వెల్లడించింది.
ఎలాంటి ఆధారాలు లేకుండా తన వ్యక్తిత్వాన్ని హననం చేసి రోడ్డుపై నిలబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కొందరికి డబ్బులు ఇచ్చి తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, ఇదంతా తనకు ఫోన్ చేసి కొందరే చెబుతున్నారని అంది. ఇంకా తాతం శెట్టి నాగేంద్రపై కూడా ఆమె తీవ్ర విమర్శలు గుప్పించింది. “రాజకీయం చేసి జనసేనకు నష్టం చేస్తున్నారు” అంటూ ఆయనపై ఆరోపించింది.
T20 World Cup 2026: భారత్ మ్యాచ్ బాయ్‌కాట్ తర్వాత, పాకిస్తాన్ ‘ఈమెయిల్’ డ్రామా..
పవన్ కళ్యాణ్ నీతిగా బతికే వ్యక్తి అని, బ్రోకర్ రాజకీయాల వల్ల ఆయనకు ఇబ్బందులు వస్తున్నాయని వ్యాఖ్యానించింది. దమ్ము, ధైర్యం ఉంటే తనకు ఎమ్మెల్యేకు మధ్య జరిగిన విషయాలపైనే మాట్లాడాలని సవాల్ విసిరింది. ఆధారాలు ఉంటే చూపించాలని, నిరూపించలేకపోతే నోటికి వచ్చిన బూతులు తిట్టాల్సి వస్తుందంటూ తీవ్రంగా స్పందించింది. తాతం శెట్టి నాగేంద్ర చేస్తున్న ప్రచారంపై సెల్ఫీ వీడియోలో మహిళా ఉద్యోగి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకటిన్నర సంవత్సరాలుగా తమ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తమకే తెలుసని, అందుకే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇప్పటివరకు బయటకు వచ్చి మాట్లాడటం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
