Site icon NTV Telugu

Crime News: ఫంక్షన్‌ ఉందని తీసుకెళ్లి.. భార్యను చంపిన భర్త! కనిపించట్లేదని డ్రామా

Dead Body 2

Dead Body 2

Husband kills his wife in Miyapur: 18 ఏళ్లుగా కలిసి జీవించిన భార్యను భర్త అతి కిరాతకంగా చంపాడు. ఆపై భార్య కనిపించట్లేదని డ్రామాలాడాడు. చివరకు మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అసలు విషయం బయటపడింది. ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలోని మియాపూర్‌లో చోటుచేసుకుంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న మియాపూర్‌ పోలీసులు.. భర్తను రిమాండ్‌కు తరలించారు. మియాపూర్‌ సీఐ ప్రేమ్‌ కుమార్‌, ఎస్సై గిరీష్‌ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన రాజేశ్వరి (38)కి అదే జిల్లా రుద్రురు మండల కేంద్రానికి చెందిన కార్పెంటర్‌ రాజేష్‌తో 2005లో వివాహమైంది. రాజేష్‌ బతుకుదెరువుకు హైదరాబాద్ వచ్చి.. మియాపూర్‌లో ఉంటున్నాడు. రాజేష్‌, రాజేశ్వరిలకు ఇద్దరు కుమారులు. పిల్లలు బోధన్‌లో రాజేశ్వరి తల్లి వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. 18 ఏళ్ల వైవాహిక జీవితం సాఫీగానే సాగినా.. భార్యాభర్తల మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఎలాగైనా రాజేశ్వరి అడ్డు తొలగించుకోవాలని డిసెంబర్ 10న గండిమైసమ్మ ప్రాంతంలో ఓ ఫంక్షన్‌ ఉందని రాజేష్‌ బైకుపై తీసుకెళ్లాడు.

Also Read: Crime News: వారం రోజులుగా ఇంట్లోనే మృతదేహం.. గుర్తించలేని స్థితిలో తల్లి, సోదరుడు!

బౌరంపేట సమీపంలో ఔటర్‌ రింగ్‌రోడ్డు సర్వీస్‌ ప్రాంతానికి రాజేశ్వరిని తీసుకెళ్లి.. తలపై రాయితో కొట్టి చంపేశాడు. మృతదేహాన్ని సర్వీస్‌ రోడ్డు పక్కనే ఉన్న కాల్వలో పడేసి.. మియాపూర్‌లోని ఇంటికి వచ్చాడు. 12న రాజేశ్వరి తల్లి, సోదరికి ఫోన్‌ చేసి.. తన భార్య కనిపించడం లేదని రాజేష్‌ నాటకం మొదలుపెట్టాడు. కంగారుపడిపోయిన రాజేశ్వరి తల్లి.. డిసెంబర్ 14న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రాజేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో.. అసలు విషయం వెలుగు చూసింది. రాజేశ్వరి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. రాజేష్‌ను రిమాండ్‌కు తరలించారు.

Exit mobile version