2 Rupees : ఉత్తరప్రదేశ్ పోలీసుల కారణంగా బీఎస్ఎన్ఎల్ కంపెనీ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. దీనికి కారణం కూడా చాలా విచిత్రంగానూ, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. రాష్ట్రంలోని మీర్జాపూర్ జిల్లాలోని 10 పోలీస్ స్టేషన్లలో సదరు బీఎస్ఎన్ఎల్ కంపెనీకి చెల్లించాల్సిన బిల్లులు చాలా ఏళ్లుగా పెండింగులో ఉన్నాయి. బిల్లు కూడా చాలా పెద్ద మొత్తమేమీ కూడా కాదు. దాన్ని కూడా వాళ్లు డిపాజిట్ చేయలేకపోయారు. జిల్లాలోని పది పోలీస్ స్టేషన్లలో కలిపి కంపెనీకి చెల్లించాల్సిన బిల్లు కేవలం రూ.248మాత్రమే. ఈ బిల్లును కూడా పోలీసులు బిల్లు డిపాజిట్ చేయకపోవడంతో బీఎస్ఎన్ఎల్ జాతీయ లోక్ అదాలత్ ను ఆశ్రయించింది.
ప్రస్తుతం మొబైల్ కంపెనీలు రీఛార్జ్ లు ఎంత ఖరీదుగా మారాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ప్రభుత్వ కంపెనీ బీఎస్ఎన్ఎల్ మాత్రం చౌక ధరకే రీఛార్జ్ లను అందిస్తోంది. దీంతో కస్టమర్‌లు ఈ కంపెనీకి ఆకర్షితులు అవుతున్నారు. కంపెనీ చౌక ప్లాన్లు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. అలాంటి సేవలందించే బీఎస్ఎన్ఎల్ కు మీర్జాపూర్ పోలీసులు రూ.248 బిల్లు చెల్లించలేకపోయారు. ఈ బకాయిలు ఒక్క పోలీస్ స్టేషన్‌లో కాకుండా జిల్లాలోని 10 పోలీస్ స్టేషన్‌లలో ఉండిపోవడం ఆశ్చర్యకరం.
మిర్జాపూర్ జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో కనీస బకాయి బిల్లు రూ.2 కాగా, గరిష్టంగా రూ.120. ఈ బిల్లులు డిపాజిట్ చేయాలని కంపెనీ పలుమార్లు పోలీసులకు నోటీసులు అందించినా పట్టించుకోలేదు. జిల్లాలోని లాల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో అత్యల్పంగా బకాయి బిల్లు రూ.2 ఉండగా, కత్రా కొత్వాలిలో అత్యధికంగా రూ.120బకాయి బిల్లులు ఉన్నాయి. ఏళ్ల తరబడి చెల్లించకుండా ఉండిపోయిన బిల్లుల కోసం బీఎస్ఎన్ఎల్ జాతీయ లోక్ అదాలత్‌ను ఆశ్రయించింది. 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోలీసు శాఖ మొత్తం రూ.248 బకాయిపడిందని మిర్జాపూర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ బీఎస్‌ఎన్‌ఎల్ పీసీ రావత్ లేఖ కూడా రాశారు. ఎన్నో ఏళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో నోటీసులిచ్చి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి సమాచార లేఖ పంపారు.