NTV Telugu Site icon

Save The Girl Child: సమాజంలో మొదటి పోలీసింగ్‌ అమ్మే చేయాలి: హోంమంత్రి అనిత

Vangalapudi Anitha

Vangalapudi Anitha

సమాజంలో మొదటి పోలీసింగ్‌ అమ్మే చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆడ పిల్లలను ఎంత బాధ్యతగా పెంచుతామో.. మగ పిల్లలను కూడా అలాగే పెంచాలన్నారు. కావాలని ఎవ్వరూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడరని, పిల్లలపై తల్లిదండ్రుల నిఘా ఎప్పుడు ఉండాలని సూచించారు. రాష్ట్రంలో మత్తు పదార్ధాలు లేకుండా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని హోంమంత్రి తెలిపారు. ‘ఆడ బిడ్దలను రక్షిద్దాం.. సమాజాన్ని కాపాడుకుందాం’ అని పిలుపునిచ్చారు.

ఆడ పిల్లలను కాపాడాలనే నినాదంతో ‘సేవ్‌ ది గర్ల్‌ ఛైల్డ్‌’ కార్యక్రమంను ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ… ‘ఆడ పిల్లలను ఎంత బాధ్యతగా పెంచుతామో మగ పిల్లలను కూడా అలాగే పెంచాలి. సమాజంలో మొదటి పోలీసింగ్ అమ్మే చేయాలి. హోమ్ మినిస్టర్‌గా కొన్ని ఘటనలు చూస్తే భయం వేస్తుంది. పొత్తిళ్ళలో ఉండే చిన్న పిల్లలపై సైతం అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. గంజాయి, మద్యం, డ్రగ్స్ మత్తులో కొంత మంది దారుణాలకు పాల్పడుతున్నారు. కావాలని ఎవ్వరూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడరు. పిల్లలపై తల్లిదండ్రుల నిఘా ఎప్పుడు ఉండాలి. సినిమాల నుంచి మంచి కన్నా చెడే ఎక్కువగా తీసుకుంటున్నారు. ఆడ బిడ్డలకు రక్షణ కల్పించినప్పుడే నిజమైన హీరోలవుతారు. రాష్ట్రంలో మత్తుపదార్ధాలు లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఈగల్ అనే టాస్క్ ఫోర్స్ ద్వారా మాదక ద్రవ్యాల నివారణకు చర్యలు చేపట్టాం’ అని అన్నారు.

పాలకొల్లులో ‘సేవ్‌ ది గర్ల్‌ చైల్డ్‌’ పేరుతో 2కె రన్‌ నిర్వహించారు. ధర్మారావు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. తాను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ‘నేను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నా. సామాజిక బాధ్యత కింద దీన్ని చేపడుతున్నా. మహిళలకు సమాన ఆస్తి హక్కు ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్‌. స్త్రీలు ఎవరిపై ఆధారపడకూడదనే సీఎం చంద్రబాబు డ్వాక్రా సంఘాలు తెచ్చారు. వారి రక్షణ కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రతి ఇంట్లో ఆడ పిల్లలను ప్రోత్సహించాలి. ఆడ పిల్లలకు అవకాశాలు ఇస్తే బాగా రాణిస్తారు’ అని అన్నారు.

Show comments