Uttam Kumar Reddy: చొప్పదండి నియోజకవర్గం నారాయణపూర్ గ్రామంలో జరిగిన ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు కీలక ప్రకటనలు చేశారు. నారాయణపూర్ ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన ఆయన, ప్రాజెక్టు నిర్మాణానికి కేవలం రూ. 80 కోట్లు ఖర్చు చేసి, నీటిని ఆయకట్టుకు అందజేయాలని ప్రభుత్వ ప్రణాళిక ఉందన్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తయిన తరువాత దాదాపు 70,000 ఎకరాల భూమి సాగులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి, నిర్వాసితులకు న్యాయం చేయడం కూడా తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు.
Also Read: Daggubati Purandeswari: అధిష్టానం ఏ పదవి ఇచ్చినా తీసుకుంటా!
గతంలో బీఆర్ఎస్ పాలనలో కేవలం 40,000 మందికే రేషన్ కార్డులు అందినప్పటికీ, తమ ప్రభుత్వం ఈ సంఖ్యను విస్తరిస్తుందని మంత్రి చెప్పారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందిస్తామని, రేషన్ ద్వారా 6 కిలోల సన్నబియ్యం ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వ్యవసాయ భూములు కలిగిన రైతులకు ఏడాదికి రూ. 12,000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు. భూమిలేని రైతు కూలీలకూ ఇదే విధంగా ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు చేకూర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, ప్రతి ఒక్కరి జీవితాల్లో మార్పు తీసుకురావడం తమ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు.