NTV Telugu Site icon

Uttam Kumar Reddy: అధిష్ఠానం నుంచి పిలుపు.. ఢిల్లీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి!

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

రెండు రోజులుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర కేబినెట్ కూర్పుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జి కేసీ వేణుగోపాల్‌, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీతో సమావేశం అయ్యారు. రెండు గంటలకు పైగా చర్చ కొనసాగింది. ఈ సమావేశంలో మంత్రివర్గ కూర్పుతో పాటు రాష్ట్రంలో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాల పైనా విస్తృతమైన చర్చలు జరిగాయని తెలుస్తోంది.

అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఇప్పటికే ఉత్తమ్ ఢిల్లీకి పయనమయ్యారు. ఉత్తమ్‌తో పాటు ఆయన సతీమణి ఎమ్మెల్యే పద్మావతి కూడా ఉన్నారు. రెండు రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండగా.. ఇప్పుడు ఉత్తమ్‌ కూడా వెళుతుండడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర కేబినెట్‌లో కీలక మార్పులుంటాయని తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ పలువురి మంత్రుల శాఖలను తొలగించే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: Kaleshwaram Commission: మరోసారి కేసీఆర్‌, హరీష్‌ రావు భేటీ.. మరో నివేదిక సిద్దం!

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా మంత్రులుగా గడ్డం వివేక్‌ వెంకటస్వామి (చెన్నూరు), అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ (ధర్మపురి), వాకిటి శ్రీహరి ముదిరాజ్‌ (మక్తల్‌)లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన వారికి శాఖల కేటాయింపు అంశంపై అధిష్ఠానంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. శాఖల కేటాయింపుపై అధిష్టానం మరోసారి రేవంత్, ఉత్తమ్‌తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఖాళీగా ఉన్న మరో మూడు మంత్రి పదవులు భర్తీపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎంతో పాటు 11 మంది మంత్రుల చేతుల్లో దాదాపు 29 శాఖలు ఉన్నాయి.