NTV Telugu Site icon

Minister Uttam Kumar Reddy: మరమ్మతులు, పునరుద్ధరణకు వారంలో టెండర్లు.. అధికారులకు మంత్రి ఆదేశాలు

Uttamkumar Reddy

Uttamkumar Reddy

Minister Uttam Kumar Reddy: భారీ వర్షాలకు తెగిపోయిన చెరువుకట్టలు, కెనాల్స్ పునరుద్ధరణకు వారం రోజుల్లో టెండర్లు పిలవాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు. చెరువులు, కాలువల పునరుద్ధరణతో పాటు పాక్షికంగా దెబ్బతిన్న చెరువులు, కాలువల మరమ్మతులకు కూడా టెండర్ల ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలన్నారు. వెంటనే పాలనా పరమైన అనుమతులు తీసుకుని శుక్రవారం ఉదయానికి ఆన్‌లైన్‌లో టెండర్లు అప్‌డేట్ చేయాలని ఆయన అధికారులకు సూచించారు. రాష్ట్రంలో తాజాగా సంభవించిన వరదల ఉధృతికి జరిగిన నష్టంపై నీటిపారుదల శాఖాధికారులతో ఎర్రమంజిల్ కాలనీ జలసౌధలోని నీటిపారుదల శాఖా కార్యాలయం నుంచి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో నీటిపారుదల శాఖా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్,ఈఎన్సీలు అనిల్ కుమార్, నాగేందర్ రావు, హరేరాం, శంకర్, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యా దాస్ నాథ్, డిప్యూటీ ఈఎన్సీ కె.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

Read Also: Hyderabad Mayor: గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు జరగరాదు..

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంతటి వర్షపు ఉధృతిలోనూ విధుల్లో నిమగ్నమయి పనిచేసిన నీటిపారుదల శాఖా సిబ్బందిని ఆయన అభినందించారు. అయితే అదే సమయంలో తాను స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటించినపుడు కొన్ని వాస్తవాలు వెలుగు చూశాయన్నారు. రెగ్యులేటరీలు, షట్టర్లు పనిచేస్తున్నాయా లేదా అన్న పరిశీలన కనిపించలేదన్నారు. తద్వారా విపత్తులు సంభవించినప్పుడు దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఒక దగ్గర రెగ్యులేటరీ జామ్ అయ్యిందన్న ఆయన.. మరోచోట షట్లర్ ఎత్తుతుంటే తెగిపోయిందన్నారు. ఈ తరహా సంఘటనలు మరోసారి పునరావృతం అయితే ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే అందుకు చీఫ్ ఇంజనీర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

Show comments