NTV Telugu Site icon

Minister Seethakka: విద్యార్థులే ప్రజా ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత

Minister Seethakka

Minister Seethakka

Minister Seethakka: విద్యార్థులే మా ప్రజా ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. వారి సమస్యలు పరిష్కరించేలా అంతా కృషి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్, గురుకుల సంస్థల్లో, విద్యాబోధన మౌలిక వసతులు, భోజన వసతి, తదితర అంశాలపై మంత్రి సీతక్క సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్, గురుకుల కార్యదర్శి సీతా లక్ష్మి, ఐటిడిఏ పీవోలు, డిప్యూటీ డైరెక్టర్లు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, విద్యాసంస్థల హెడ్‌ మాస్టర్లు, వార్డెన్స్, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల పదోన్నతులు, బదిలీలు పూర్తి చేశామని.. ఇంకా బోధన, ఇతర సిబ్బంది సమస్యలు ఉంటే పరిష్కరిస్తామన్నారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్షాకాలంలో టీచర్లు, వార్డెన్లు పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు.

Read Also: Congress: కాంగ్రెస్‌ గూటికి భారత రెజ్లర్లు.. కాసేపట్లో హస్తం పార్టీలో చేరనున్న వినేష్ ఫోగట్, పునియా

విద్యార్థులు హాస్టల్ విడిచి వాగుల వద్దకు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లకుండా చూడాలన్నారు. విద్యార్థులు జ్వరబారిన పడితే ఇంటికి పంపకుండా మనమే మెరుగైన వైద్యం అందించాలన్నారు. హాస్టల్ విద్యార్థులను సొంత పిల్లలుగా చూసుకోవాలని.. అప్పుడే మీ పిల్లలను దేవుడు మంచిగా చూస్తాడన్నారు. హాస్టల్స్ అంటే సొంత ఇంటిలా విద్యార్థులు ఫీల్ అవ్వాలన్నారు. నాణ్యమైన వేడి భోజనాన్ని అందించాలని.. వేడి చేసి చల్లార్చిన తాగు నీటిని ఇవ్వాలని ఆదేశించారు. తప్పకుండా మెనూ ఫాలో కావాలన్నారు. సరుకుల సరఫరా సరిగా లేకపోతే టెండర్లు రద్దు చేస్తామన్నారు. చిన్న చిన్న సమస్యలను బూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగుల స్థైర్యాన్ని దెబ్బ తీసేలా కొందరు వ్యవహరిస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్లు, వార్డెన్లు, సిబ్బంది మరింత జాగ్రత్తగా వ్యవరించాలన్నారు. మానవత్వాన్ని జోడించి మంచి విద్యను, నాణ్యమైన సేవలను అందించాలన్నారు. మీ కృషే విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని మంత్రి పేర్కొన్నారు. ఎస్టీ సంక్షేమ శాఖ ముఖ్యమంత్రి వద్ద ఉందని.. ఎస్టీ విద్యార్థుల సంక్షేమం పట్ల సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు. గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లులను చెల్లిస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.