NTV Telugu Site icon

Minister Seethakka: ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై అనవసర రాజకీయాలు చేయొద్దు

Seethakka

Seethakka

Minister Seethakka: హైదరాబాద్ నగరంలోని ఎర్రమంజిల్ లో ఉన్న మిషన్ భగీరథ కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి కార్యదర్శి లోకేష్ కుమార్, డైరెక్టర్ సృజనతో పాటు అన్ని జిల్లాల డిఆర్డిఓల అధికారులు హాజరయ్యారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలుపై దిశానిర్దేశం చేస్తూ మంత్రి పలు కీలక సూచనలు చేశారు. కూలీల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేస్తామన్న మంత్రి, ఉపాధి హామీ పథకం కింద మహిళా కూలీలకు వారి బ్యాంకు ఖాతాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మొత్తాన్ని జమ చేస్తామని పేర్కొన్నారు.

Also Read: Sanchar Saathi App: స్పామ్ కాల్స్ ఆటకట్టు.. సంచార్ సాథీ యాప్ తీసుకొచ్చిన కేంద్రం

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం కావడం వల్ల మహిళల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయడం జరుగుతోందని ఆమె అన్నారు. ఇలాంటి పథకాన్ని తీసుకురావడం పేద కుటుంబం నుంచి వచ్చిన నాకు ఎంతో ఆనందం అని మంత్రి తెలిపారు. గ్రామసభలు శాంతియుత వాతావరణంలో జరగాలని.. అర్హుల గుర్తింపు, లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల వేదికగానే జరగాలని మంత్రి స్పష్టం చేశారు. గ్రామ సభ నిర్ణయమే ఫైనల్ అంటూ.. అనవసర రాజకీయాలు, కవ్వింపు చర్యలకు తావివ్వకుండా పథకం అమలులో అధికారులు మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని మంత్రి సూచించారు.

Also Read: Manchu Manoj: విష్ణుకి మనోజ్ ఛాలెంజ్.. నేను ఒక్కడినే ఏ ప్లేస్ కైనా వస్తా!

తెలంగాణలో అటవీశాఖ అనుమతులు పెండింగులో ఉండడంతో కొన్ని ప్రాజెక్టులు ఆగిపోయాయని, ఈ విషయాన్ని సీఎం ఇటీవల కేంద్ర మంత్రికి వివరించారని మంత్రి సీతక్క తెలిపారు. కేంద్ర మంత్రి ఆదేశాలపై తెలంగాణకు వచ్చిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ జితేంద్ర కుమార్, పెండింగులో ఉన్న 161 ప్రాజెక్టులపై సమావేశం నిర్వహించారని పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీ చేయని టీఆర్ఎస్ ఇప్పుడు రైతులపై మొసలి కన్నీరు కారుస్తోందని, కూలీలకు రూపాయి సహాయం చేయని పెద్దలు విమర్శలు చేయడం హాస్యాస్పదం అంటూ పేర్కొన్నారు. కానీ, మన ప్రభుత్వం రైతు భరోసా, పంట బోనస్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాల ద్వారా కూలీలకు, రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని మంత్రి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించాలని, పథకాన్ని విఫలమయ్యేలా కుట్రలకు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. పథకం అమలులో లోటుపాట్లను సవరించి అభివృద్ధి, సంక్షేమం నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని మంత్రి వెల్లడించారు.