తెలంగాణలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. మునుగోడు ఉప ఎన్నిక చుట్టే తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. అయితే.. నిన్నటితో మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ ప్రక్రియ ముగిసింది. అయితే ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించేందుకు జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నిన్నటికి నిన్న టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. అందుకు అవును అన్నట్లుగానే ఈ రోజు ఉదయం టీఆర్‌ఎస్‌కు బూర నర్సయ్య రాజీనామా చేశారు. అయితే.. త్వరలోనే అమిత్ షా సమక్షంలో బీజేపీలోకి బూర నర్సయ్య గౌడ్ చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పై మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్‌తో విభేదించి రాజకీయంగా ఎదిగిన నేతలు ఎవరూ లేరని అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్.
Also Read : Andaman and Nicobar: ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సామూహిక అత్యాచారం.. చీఫ్ సెక్రటరీపై మహిళ ఆరోపణలు
పార్టీ మారే హక్కు ఎవరికైనా ఉందని.. పార్టీ మారాలనుకున్నప్పుడు అవకాశం ఇచ్చి రాజకీయ బిక్ష పెట్టిన పార్టీపై విమర్శలు చేయడం సరి కాదని ఆమె అన్నారు. రాజకీయంగా గుర్తింపు లేని బూర నరసయ్య గౌడ్ కు ఎంపీ సీటు ఇచ్చి గెలిపించుకున్న కేసీఆర్ రెండోసారి కూడా అవకాశం ఇచ్చారని ఆమె అన్నారు. ఓడిపోయిన తర్వాత కూడా మరొకరికి నియోజకవర్గ ఇంచార్జీ బాధ్యతలు ఇవ్వలేదని ఆమె గుర్తు చేశారు. ముఖ్యమంత్రిని బదనాం చేయడానికే ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నరని ఆమె విమర్శించారు. కోవర్టులుగా పని చేయడం కంటే పార్టీ వీడటమే మంచిదని ఆమె అన్నారు.