Minister Satya Kumara Yadav: ప్రగతి పథంలో పరుగులిడుతూ స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దటం అందరి తక్షణ కర్తవ్యమని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నైపుణ్యతతో కూడిన మానవ వనరుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుని తద్వారా వచ్చే ఆర్థిక ప్రగతితో స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాకారం చేసుకోడానికి ప్రజలు తరచుగా అనారోగ్యం పాలు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ, ప్రయివేట్ వైద్య సిబ్బంది, ఆసుపత్రులపై ఉందని ఆయన వ్యాఖ్యానించారు. గుర్లలో డయేరియా వ్యాధి ప్రబలటంపై ఆరుగురు వైద్య నిపుణులతో కూడిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీం (ఆర్ ఆర్‌టి) అందించిన నివేదికలోని పలు అంశాలు, సూచనలను మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులతో మంత్రి సత్యకుమార్ యాదవ్ గురువారం నాడు రెండు గంటలకు పైగా లోతుగా సమీక్షించారు.
గుర్లలో డయేరియా కేసులు నమోదైన తేదీలు, ప్రభుత్వ వైద్య సిబ్బంది చేపట్టిన చర్యలు, వ్యాధిని అదుపులోకి తెచ్చిన వైనంపై సంబంధిత అధికారులకు మంత్రి పలు ప్రశ్నలు సంధించారు. పరిశుభ్రమైన తాగునీటి సరఫరా, పారిశుధ్యం విషయాలకు సంబంధించి సంబంధిత శాఖలతో క్షేత్రస్థాయి వైద్య సిబ్బంది సమన్వయం చేసిన తీరును కూడా తెలుసుకున్నారు. వ్యాధిని అరికట్టడానికి వైద్య సిబ్బంది ఆశించిన స్థాయిలో కృషి చేశారా లేదా అని మంత్రి ప్రశ్నించారు. గుర్ల అనుభవాల నుంచి ఎటువంటి పాఠాలు నేర్చుకున్నారు …అలాంటి పరిస్థితులు పునరావృతమైతే మెరుగైన ప్రయత్నాలను ఏ విధంగా చేపడతారు అని కూడా మంత్రి సత్యకుమార్ యాదవ్ అడిగారు. గుర్లలో డయేరియా వ్యాధి ప్రబలడానికి దారితీసిన పరిస్థితులు, వైద్య శాఖ అందించిన సేవల్ని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ కె.పద్మావతి వివరించారు. మొత్తం 120 మంది వైద్య సిబ్బందిని గుర్లలో మూడు షిప్టుల్లో నియమించి దాదాపు 200 మంది ప్రాణాల్ని కాపాడగలిగామని ఆమె వివరించారు. ఈ దిశగా వైద్య సిబ్బంది కృషిని మెచ్చుకున్న మంత్రి ఇలాంటి ప్రతి అనుభవంతో మున్ముందు రానున్న సవాళ్లను మరింత పటిష్టంగా అధిగమించాలని ఆయన సూచించారు.
Read Also: Minister Vangalapudi Anitha: వైఎస్ జగన్‌పై హోంమంత్రి అనిత ఫైర్..
పారిశుధ్యం, నిత్య జీవితంలో ఆచరించాల్సిన ఆరోగ్యకరమైన పద్ధతులు, అలవాట్ల పట్ల ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం పట్ల మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దిశగా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడానికి ప్రభావవంతమైన ప్రచారోద్యమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. అనారోగ్యం వల్ల కలిగే అరిష్టాలు, ఆరోగ్యంతో వచ్చే ప్రయోజనాల పట్ల ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు.
గుర్లలో ఎదురైన పరిస్థితులు పునరావృతం కాకుండా చూసేందుకు సుదీర్ఘమైన చర్చల అనంతరం మంత్రి పలు ఆదేశాలిచ్చారు….
1) ప్రజల వ్యక్తిగత ఆరోగ్యంతో కూడిన ఆరోగ్యాంధ్రప్రదేశ్ అవసరం పట్ల ప్రజల్లో తగు చైతన్యాన్ని కల్పించడానికి వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారాన్ని చేపట్టాలి
2) ప్రజారోగ్యంతో ముడిపడి ఉన్న ఇతర ప్రభుత్వ శాఖలతో పటిష్టమైన సమన్వయం చేసుకోవాలి
3) స్థానిక పంచాయతీ, పురపాలక, ఆర్ డబ్ల్యుయస్, పంచాయతీరాజ్ అధికారులతో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేయాలి
4) వ్యాధుల నివారణ, అనంతర నియంత్రణ చర్యలపై ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు వర్షా కాలంలో 15 రోజులకోసారి, ఇతర సమయాల్లో నెలకోసారి సమావేశమై చేపట్టాల్సిన చర్యలపై చర్చించి, తగు విధంగా చర్యలు చేపట్టాలి
5) సాగునీటి వనరులు, సరఫరా వ్యవస్థల్ని కలుషితం చేసే మార్గాల్ని గుర్తించి సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా కాలుష్యాన్ని నివారించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలి
6) వివిధ వ్యాధులకు సంబంధించి సూచాయగా కేసులు బయటపడిన వెంటనే ప్రభుత్వ వైద్య సిబ్బంది రంగంలోకి దిగి వ్యాధి ప్రాబల్యాన్ని అరికట్టడానికి చర్యలు చేపట్టాలి
7) బాధిత రోగులందరికీ వైద్య ప్రోటోకాల్ మేరకు చికిత్స అందించేందుకు సెకండరీ, టెర్షియరీ ఆసుపత్రుల భాగస్వామ్యంతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి
8) వ్యాధికి గురైన వారిని గుర్తించి వారితో ఇతరుల సంపర్కాన్ని అరికట్టి వ్యాధి ప్రబలకుండా చర్యలు చేపట్టాలి
9) తరచుగా తాగునీటి పరీక్షలు చేయించి, నీటి నాణ్యతను గుర్తించి అవసరం మేరకు తగు చర్యలు చేపట్టాలి
10) వ్యాధి ప్రబలే సంకేతాలు వచ్చినప్పుడు ఆయా ప్రాంతాల్లో వివిధ మార్గాల ద్వారా ప్రజలకు తెలియజేసి హెచ్చరికలు చేయాలి