Minister Satya Prasad: అతి త్వరలో తిరుపతిలో లూలు మాల్, హయత్ మాల్స్ రానున్నట్లు రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కన్నా మిన్నగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామని, తిరుపతిలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న శెట్టిపల్లి సమీక్ష సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి చొరవతో రెవెన్యూ, మున్సిపల్ శాఖ మంత్రులు, సిసిఎల్ఎ, జిల్లా కలెక్టర్ జెసి మున్సిపల్ కమిషనర్లతో, సమీక్ష నిర్వహించి మోడల్ టౌన్షిప్ గా రూపుదిద్దుకునేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే శ్రీ సిటీ నందు రెండవ దఫా భూ కేటాయింపు 2500 ఎకరాలకు కలెక్టర్, జేసి కృషి చేస్తున్నారని, పలు పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా తీర్చి దిద్దుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇక ఒబెరాయ్ హోటల్ ఏర్పాటుకు ప్రత్యామ్నాయ భూమి కేటాయింపు చేస్తున్నామని, కూటమి ప్రభుత్వం టూరిజం ఒక పరిశ్రమగా గుర్తించి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రోగ్రెసివ్, ప్రో యాక్టివ్ గవర్నమెంట్ గా పనిచేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. అలాగే తిరుపతి నందు టిడిఆర్ బాండ్లపై చర్యలు తీసుకుంటామని, తిరుపతి జిల్లా పర్యాటక హబ్ గా ఎదిగేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
అలాగే తిరుపతి టూరిజం హబ్ గా చేసేందుకు ముఖ్యమంత్రి పూర్తి సహకారం ఉంటుందని.. అలాగే పులికాట్ ముఖ ద్వార పూడికతీతకు 100 కోట్ల రూపాయల నిధులతో పనులు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నట్లు ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో తిరుపతి జిల్లాలో 34 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అందుబాటులో రానున్నదని ఆయన అన్నారు.అలాగే జర్నలిస్టులకు స్థలాల కేటాయింపు త్వరలో ఇస్తామని ఆయన అన్నారు. రానున్న వేసవికి తిరుపతి జిల్లాలో త్రాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రణాళికలు సిద్ధం చేయబోతున్నట్లు ఆయన తెలిపారు.