Sabitha Indrareddy: తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందని చేవెళ్లలో సభ నిర్వహిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బీజేపీ నాయకులను ప్రశ్నించారు. శనివారం చేవెళ్ల నియోజకవర్గం కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 9 ఏళ్ల కాలంలో తెలంగాణకు ఏం మేలు చేసిందని చేవెళ్లలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేమని చెప్పడానికా, లేదా పాలమూరు-రంగారెడ్డికి మోకాలు అడ్డం అని చెప్పడానికి చేవెళ్లకు వస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు గడిచిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు విభజన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదని మండిపడ్డారు. ఈ రాష్ట్రానికి మేలు చేస్తామనే మాట బీజేపీ వాళ్ళ నోటి నుంచి ఒక్కసారి కూడా రావడం లేదన్నారు.
తెలంగాణ రాష్ట్రం మీద బీజేపీ ప్రభుత్వం ప్రత్యేకమైన వివక్షను చూపిస్తుందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు తెలంగాణలో సభలు పెట్టినప్పుడల్లా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప… తెలంగాణకు చేసిందేమీ లేదని విమర్శించారు. చేవెళ్లకు వస్తున్న అమిత్ షా పాలమూరు రంగారెడ్డికి, కాళేశ్వరం ప్రాజెక్టులకి జాతీయ హోదాలు ఇస్తున్నట్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Read Also: Paper Leak Case: ప్రశ్నపత్రాల లీకేజీపై హైకోర్టులో కౌంటరు దాఖలు చేసిన టీఎస్‌పీఎస్సీ
ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేసిన దాఖలా లేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాపీ కొట్టి దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ పేరుతో రైతులకు 2000 అందిస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో కలెక్టరేట్ భవనాలకు రూ. 60 కోట్లు ఖర్చు చేసి నూతన భవనాలు నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్‌కి దక్కుతుందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలన్నీ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నట్లు, జాతీయస్థాయిలో తెలంగాణ రాష్ట్రంలోని అనేక గ్రామ పంచాయతీలకు ఉత్తమ అవార్డులు కేంద్రమే అందించినట్లు తెలిపారు. చేవెళ్లలో జరిగే బీజేపీ సభలో కాలేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తామని అమిత్ షా సభలో ప్రకటించాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య డిమాండ్ చేశారు.