Site icon NTV Telugu

Bhu Bharathi: నేడు భూ భారతి పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Bhu Bharathi

Bhu Bharathi

Bhu Bharathi: నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలో నేడు భూ భారతి పైలట్ ప్రాజెక్టును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించనున్నారు. భూ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడమే కాకుండా, రైతులకు భూమిపై పూర్తి హక్కులను బలపరచే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో పాటు, నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులు ప్రారంభం కానున్నాయి. జూన్ 2వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో ఈ అవగాహన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. గ్రామస్థాయిలో ప్రజలకు భూ హక్కులపై స్పష్టతనివ్వడం, కొత్త చట్టంలోని ముఖ్యాంశాలను వివరించడం ఈ సదస్సుల ప్రధాన ఉద్దేశ్యం.

ప్రతిరోజు రాష్ట్రవ్యాప్తంగా రెండు మండలాల్లో ఈ సదస్సులను నిర్వహించాలంటూ ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రతి సదస్సులో జిల్లా కలెక్టర్లు తప్పకుండా పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలతో నేరుగా ముఖాముఖి చర్చలు జరిపి, వారి సందేహాలను నివృత్తి చేయడం ద్వారా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. ఇక వికారాబాద్ జిల్లా పుడూరు మండలంలో నిర్వహించే భూ భారతి చట్ట అవగాహన సదస్సులో కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన చట్టం ముఖ్యాంశాలు, ప్రభుత్వ లక్ష్యాలపై ప్రజలను వివరంగా అవగాహన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు అవగాహన కార్యక్రమాలు భూ పరిపాలనలో గణనీయమైన మార్పులకు నాంది కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది.

Exit mobile version