NTV Telugu Site icon

Minister Rama Naidu: చింతలపూడి ఎత్తిపోతల ద్వారా 2.15 లక్షల ఎకరాలకు నీరు

Minister Ramanaidu

Minister Ramanaidu

Minister Rama Naidu: 2014-19లో గత టీడీపీ పాలనలో రూ.3038 కోట్లు ఖర్చుపెట్టి 40 పనులు పూర్తి చేశామని.. 2019-24 వైసీపీ పాలనలో కేవలం రూ. 760 కోట్లు ఖర్చుపెట్టి 5 శాతం పనులు మాత్రమే చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీ వేదికగా తెలిపారు. పట్టిసీమ, పురుషోత్తమ పట్నం, చింతలపూడి ఎత్తిపోతల పథకాలపై తమ అనుచరులతో ఎన్జీటీలో వైసీపీ కేసులు వేయించిందని చెప్పారు. 2021 డిసెంబర్‌లో వైసీపీ అధికారంలో ఉండగానే చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు ఎన్జీటీ రూ.73 కోట్ల పెనాల్టీ విధించిందని వెల్లడించారు. 3 నెలల్లో అనుమతులు తీసుకోవాలని చెప్పినా, పట్టించుకోకపోవడంతో 3 సంవత్సరాలు ప్రాజెక్ట్ పనులు నిలిచిపోయాయన్నారు. భూసేకరణకు సంబంధించి, సంబంధిత కలెక్టర్లు, ఆర్ అండ్ ఆర్ అధికారులతో 8 సార్లు సమీక్షలు చేశానని మంత్రి పేర్కొన్నారు.

Read Also: Gold Rate Today: ఇది కదా ‘బంగారం’ లాంటి వార్త.. వరుసగా మూడో రోజు తగ్గిన గోల్డ్ రేట్స్!

ఇంకా 934 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉందని.. 4 రకాలుగా ఈ భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రూ.2500 కోట్లతో మొదటి దశలో పనులు పూర్తి చేసి 3 లక్షల ఎకరాలకు సాగునీరు , తాగు నీరు అందించేలా పనులు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారన్నారు. జల్లేరు రిజర్వాయర్‌ను వదులుకున్నాం, పక్కన పెట్టాం అని చెప్పి , ఇప్పుడు మా ప్రభుత్వం పై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. 4 జిల్లాల్లో , 11 నియోజకవర్గాల్లో 4.80 లక్షల ఎకరాలకు సాగు నీరు, 25 లక్షల మందికి తాగు నీరు అందుతుందన్నారు. చింతలపూడి ఎత్తిపోతల ద్వారా నాగార్జున సాగర్ కింద ఉన్న 2.15 లక్షల ఎకరాలకు నీరు అందించవచ్చన్నారు. ఆ నీటిని శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా రాయలసీమకు ఉపయోగించుకోవచ్చని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.

ఎర్ర కాలువ ఆధునీకరణ పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నకు  మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చారు. 2014 లో గత టీడీపీ పాలనలో 6 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న ఎర్ర కాలువను 20, 250 క్యూసెక్కులకు పెంచుతూ రూ.143 కోట్లు కేటాయించి ఆధునీకరణ పనులు చేపట్టామన్నారు. 2018 లో భారీ వర్షాలకు ఎర్రకాలువ సామర్థ్యానికి మించి వరద రావడంతో గండ్లు పడ్డాయన్నారు. 2014-19 వరకు రూ.52 కోట్ల రూపాయల పనులు చేశామని వెల్లడించారు. 2019-24 వైసీపీ పాలనలో ఎర్ర కాలువ ఆధునీకరణకు ఒక్క రూపాయి కూడా కేటాయుంచలేదన్నారు. ఈ ఏడాది జులై లో వచ్చిన వర్షాలకు 98 ప్రాంతాల్లో ఎర్రకాలువకు గండ్లు పడ్డాయని తెలిపారు. నిధుల సమస్య ఉన్నా ఎర్రకాలువ ఆధునీకరణ పనులపై ప్రత్యేక దృష్టి పెడతామని మంత్రి స్పష్టం చేశారు.

 

Show comments