NTV Telugu Site icon

Minister Narayana: వారికి చెత్త మీద పన్ను వేయడమే తెలుసు.. అద్భుతాలు చేయడం తెలియదు..

Narayana

Narayana

Minister Narayana: గత ప్రభుత్వానికి చెత్త మీద పన్ను వేయడమే తెలుసునని.. కానీ ఆ చెత్తను ఉపయోగించి ఏ అద్భుతాలు చేయాలో తెలియదని మంత్రి నారాయణ విమర్శించారు. గుంటూరు జిల్లా నాయుడుపాలెం ప్రాంతంలో జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌ను మంత్రి నారాయణ, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, తదితరులు సందర్శించారు. అక్టోబర్ రెండో తేదీకి, రాష్ట్రంలో ఉన్న డంప్ యార్డ్స్‌లో ఉన్న చెత్త మొత్తాన్ని క్లియర్ చేస్తామని మంత్రి తెలిపారు. నగరాల్లో ఉత్పత్తి అయ్యే చెత్త ద్వారా, ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పాలని, 2014 టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సింగపూర్ తరహా దేశాలు కూడా ఇదేవిధంగా ఎనర్జీని ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. త్వరలోనే కాకినాడ, నెల్లూరులో చెత్త ద్వారా ఎనర్జీ ఉత్పత్తి చేసే ప్లాంటు ఏర్పాటు చేస్తామన్నారు.

Read Also: Maoists: చింతూరు ఏజెన్సీలో మావోల దుశ్చర్య.. కారును దగ్ధం చేసిన మావోయిస్టులు!

కడప -కర్నూలు మధ్యలో కూడా మరొక ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్థలాలు అందుబాటులో ఉండటం వల్ల గుంటూరు, విశాఖపట్నంలో శరవేగంగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పామన్నారు. ప్లాంటు పెట్టడం వల్ల 50 నుండి 60 కిలోమీటర్ల పరిధిలో ఉండే మున్సిపాలిటీలు, ఇతర ప్రాంతాల్లో ఉండే చెత్త మొత్తం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌కు చేరుతుందన్నారు. తద్వారా పట్టణ ప్రాంతాల్లో కాలుష్యం తగ్గుతుందని.. ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. గుంటూరు సమీపంలో ఉన్న జిందాల్ ఎనర్జీ ప్లాంట్‌కు 6,990 మెట్రిక్ టన్నుల చెత్త వస్తోందన్నారు. చెత్త ద్వారా ఎనర్జీ ఉత్పత్తి చేసే, ప్లాంట్లు భారతదేశం మొత్తం కలిపి 3 ప్లాంట్లు ఉంటే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 10 ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. పట్టణాలు, నగర ప్రాంతాల్లో విస్తరిస్తున్న ప్రాంతాలకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.