NTV Telugu Site icon

Nara Lokesh: త్వరలోనే తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేస్తాం!

Nara Lokesh

Nara Lokesh

తెలంగాణలో టీడీపీ పార్టీ పునర్నిర్మాణంపై చర్చిస్తున్నాం అని, త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తాం అని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. తెలంగాణలో 1.60 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారని, టీడీపీపై తెలంగాణ ప్రజలకు ప్రేమ మరియు ఆశ ఉందన్నారు. తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేయడమే తమ లక్ష్యం అని లోకేశ్‌ చెప్పారు. నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద మంత్రి నారా లోకేశ్‌ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సీఎంగా ఎన్టీఆర్‌ ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేశారు.

ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద మంత్రి నారా లోకేశ్‌ మీడియాతో మాట్లాడుతూ… ‘ఎన్టీఆర్ కేవలం మూడు అక్షరాలు కాదు.. అదొక్క ప్రభంజనం. సినీ రంగంలో అన్ని రకాల సినిమాలు తీసి తన మార్క్ చూపించారు. రాజకీయాల్లో కూడా ఎన్నో సేవలు అందించారు. రెండు రూపాయలకే బియ్యం అందించారు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్. తెలుగు వారిని మద్రాసీలు అనేవారు.. వాళ్లందరికీ తెలుగు వరమని గర్వంగా చెప్పుకునేలా చేశారు. ఎన్టీఆర్ ఏ ఆశయాలతో పార్టీని పెట్టారో మాకు తెలుసు. ఆయన ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళతాం. ఏదైనా తప్పు జరిగితే.. దానిని సరిదిద్దడానికి కూడా పార్టీలో పెద్దలు ఉన్నారు’ అని చెప్పారు.

Also Read: Lakshmi Parvathi: సీఎం చంద్రబాబుపై లక్ష్మీ పార్వతి హాట్ కామెంట్స్!

‘మా చిన్న తనంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నారు. అప్పుడు ఆయన అబిడ్స్ లో ఉండేవారు. ఆ సమయంలో మమ్మల్ని గండిపేట తీసుకెళ్లేందుకు ఒక పెద్ద కారులో ఆయనే స్వయంగా డ్రైవ్ చేస్తూ తీసుకెళ్ళారు. దారి మధ్యలో లెఫ్టుకు వెళ్లాలో, రైటుకు వెళ్లాలో తెలియక రోడ్డు మధ్యలో గుద్దేశారు. అది మాకు ఎప్పుడు గుర్తుండి పోయే మెమరీ. తెలంగాణలో టీడీపీపై ప్రజలకు ఎంతో ప్రేమ ఉంది. అందుకు ఉదాహరణ.. స్వచ్చందంగా లక్షా 60 వేల సభ్యత్వాలు ప్రజలు తీసుకోవడం. ఇప్పుడు ఎలాంటి ఎమ్మెల్యేలు లేకుండా ఇంతమంది సభ్యత్వం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా పార్టీ కార్యకలాపాలు ప్రారంభిస్తాం. త్వరలోనే తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేస్తాం’ అని నారా లోకేశ్‌ చెప్పుకొచ్చారు.