ఆంధ్రప్రదేశ్ లో చౌక ధరల దుకాణాలు మళ్లీ తెరుచుకుంటున్నాయని సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29,796 రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ ప్రారంభం కానుంది. నేడు పిఠాపురంలో రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు రేషన్ రైస్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించనున్నారు. కూటమి ప్రభుత్వం నిర్ణయం మేరకు నేటి నుంచి డీలర్లు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు పంపిణీకి సిద్ధమయ్యారు.
Also Read:Russia: ఘోర రైలు ప్రమాదం.. ఏడుగురు మృతి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15,74,057 మంది దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటివద్దే రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆదివారాల్లో సైతం సరుకులు పంపిణీ చేయనున్నారు. 1 కోటి 46 లక్షల కార్డుదారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయి. ప్రతి రేషన్ దుకాణాల వద్ద విధిగా ధరలు, స్టాక్ బోర్డు, పోస్టర్లు ఏర్పాటు చేయనున్నారు. కార్డుదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరుకులు పంపిణీ చేపట్టనున్నారు. నేటి నుంచి నెలలో 15 రోజులపాటు.. రోజుకు రెండు పూటలు… చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ చేస్తారు. ప్రతీ పేద కుటుంబానికి రేషన్ సరుకులు అందించేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం.