Site icon NTV Telugu

Kottu Satyanarayana: యాగంతోనే ఏపీకి కేంద్రం నిధులు.. మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు

Kottu Satyanarayana

Kottu Satyanarayana

Minister Kottu Satyanarayana: ఏపీలో ఇటీవల నిర్వహించిన లక్ష్మీ రాజ శ్యామల యాగం చేసిన ఫలితంగా అనుకూల పరిస్థితులు వచ్చాయని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న నిధులు ఇప్పుడే వచ్చాయన్నారు. రాష్ట్రానికి నిధుల వరద అని మీడియాలో కథనాలు వచ్చాయని.. ఇది యజ్ఞఫలితమనే చెప్పటానికి దేవదాయశాఖ మంత్రిగా చొరవ తీసుకుంటున్నానని ఆయన వెల్లడించారు. శ్రీశైల క్షేత్రంలో కుంభాభిషేకం చేసేందుకు సంకల్పించినా ఉష్ణోగ్రతలు, వివిధ పరిస్థితుల కారణంగా వాయిదా వేశామని ఆయన పేర్కొన్నారు. ఆలయాల ఆస్తుల అక్రమణ, లీజు గడువు ముగిసినా అన్యాక్రాంతం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలకు వీల్లేకుండా చట్ట సవరణ చేశామన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.

Read Also: Minister Harish Rao: కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేం లేదు..

తిరుపతి హథీరాం జీ మఠానికి మహంతుగా ఉన్న అర్జున్ దాస్ అనే వ్యక్తి అనేక అక్రమాలకు పాల్పడ్డారని.. కోట్లాది రూపాయల ఆస్తుల్ని అన్యాక్రాంతం చేశారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వానికి హథీరాంజీ మఠంపై ఎలాంటి హక్కులు లేకుండా అర్జున్ దాస్ కోర్టుకెళ్లారన్నారు. హథీరాం జీ మఠం ఆస్తుల్ని లీజులకు ఇస్తు అక్రమాలకు పాల్పడుతున్నట్టు తేలిందని మంత్రి చెప్పారు. సన్యాసిగా ఉండాల్సిన మహంత్ అర్జున్ దాస్ వివాహం చేసుకుని పిల్లల్ని కూడా కన్నారని ఆయన చెప్పుకొచ్చారు. దీనిపై కమిటీని వేసి చర్యలు కూడా తీసుకున్నామన్నారు. అందుకే ధార్మిక పరిషత్ ద్వారా స్వామీ హథీరాం జీ మఠం మహంత్‌గా ఉన్న అర్జున్ దాస్‌ను సస్పెండ్ చేసి క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని మంత్రి వివరించారు. హథీరామ్ జీ మఠానికి మరొకరిని బాధ్యులుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు.

Exit mobile version