NTV Telugu Site icon

Minister Kottu Satyanarayana: పొత్తులో పవన్, చంద్రబాబు చివరివరకు ఉంటారనేది అనుమానమే!

Minister Kottu Satyanarayana

Minister Kottu Satyanarayana

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధర్మాన్ని ఆశ్రయించారని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పొత్తులో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చివరివరకు ఉంటారనేది అనుమానమే అని పేర్కొన్నారు. పొత్తులు చివరివరకు ఉంటాయో? లేదో? చూడాల్సిందే అని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు తాను చేసిన మోసాలు చూసి ఓటు వేయమని అడుగుతారా?, పవన్ ప్రజలను ఏమని ఓటు అడుగుతారు? అని మంత్రి కొట్టు విమర్శించారు. తండ్రి ఆశయాలను గాలికి వదిలేసి చంద్రబాబు స్క్రిప్ట్‌ను ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్ షర్మిల చదువుతున్నారని మండిపడ్డారు.

పశ్చిమ గోదావరిలో మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ… ‘పవన్ కళ్యాణ్ అధర్మాన్ని ఆశ్రయించారు. పొత్తులో పవన్, చంద్రబాబు చివరివరకు ఉంటారనేది అనుమానమే. బాబు రెండు సీట్లు ప్రకటించారు కాబట్టి నేను రెండు సీట్లు ప్రకటించానన్నారు. ఇద్దరు పొత్తులో ఉన్నా.. ఎవరి దారి వారిదే. విహంగ వీక్షణ అంటే ప్రజలను గాలికి వదిలేస్తారా?. పొత్తులు చివరివరకు ఉంటాయో? లేదో? అనేది చూడాల్సిందే. పద్దతి ప్రకారం సీఎం వైఎస్ జగన్ ముందుకు వెళ్తున్నారు. మీ కుటుంబాలకు మేలు జరిగితే.. నాకు ఓటు వేయమని సీఎం అడుగుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నవారు దర్మపక్షం ఉన్నట్టు’ అని అన్నారు.

Also Read: Australian Open 2024: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సంచలనం.. ప్రపంచ నంబర్‌వన్‌ ‘జకోవిచ్‌’ ఔట్‌!

‘చంద్రబాబు నాయుడు నేను చేసిన మోసాలు చూసి ఓటు వేయమని అడుగుతారా?. పవన్ కళ్యాణ్ ప్రజలను ఏమని ఓటు అడుగుతారు. గెలుపు ఎప్పుడు ధర్మం పక్షాన ఉంటుంది. వైఎస్ షర్మిలకు ఇంకా రాజకీయ పరిణతి లేదు. చంద్రబాబు ఉచ్చులో ఆమె పడిపోయారు. తండ్రి ఆశయాలను గాలికి వదిలేసి.. చంద్రబాబు స్క్రిప్ట్ షర్మిల చదువుతున్నారు. వైఎస్ రక్తం పంచుకుపుట్టిన షర్మిల లేనిపోని అబాండాలు సీఎం జగన్‌పై వేస్తున్నారు. రాష్ట్రానికి అన్ని విధాలుగా ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీతో షర్మిల చేతులు కలిపారు’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే రెండు స్థానాలను ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. టీడీపీ రెండు సీట్లు ప్రకటించినందున తానూ 2 స్థానాలను ప్రకటిస్తున్నట్లు పవన్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కొట్టు సెటైర్లు వేశారు.