ఏపీ శాసనమండలిలో పెన్షన్లపై వైసీపీ సభ్యులు ప్రశ్నలు సంధించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యే సమయానికి 53 లక్షల మందికి పెన్షన్‌లు ఉన్నాయని, కూటమి అధికారంలోకి వచ్చే సమయానికి 65 లక్షలకు పెన్షన్లు పెరిగాయని వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పేర్కొన్నారు. ఇప్పుడు పెన్షన్లు ఎన్ని తొలగించారని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చాక 1.89 లక్షల మందికి తగ్గించారని, బడ్జెట్‌లో ఉన్న పెన్షన్లకి సరిపడా కేటాయింపులు చేయలేదని వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయేల్ ఫైర్ అయ్యారు. వైసీపీ సభ్యుల ప్రశ్నలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు.
‘గత ప్రభుత్వ హయాంలో ఇబ్బడిముబ్బడిగా పెన్షన్లు మంజూరు చేసింది. కూటమి అధికారంలోకి వచ్చాక 1.89 లక్షల మందికి తగ్గించారు. బడ్జెట్‌లో ఉన్న పెన్షన్లకి సరిపడా కేటాయింపులు చేయలేదు. మీరు 50 ఏళ్లకే ఇస్తామన్న పెన్షన్లు ఇస్తారా? లేదా?. పెన్షన్ల పరిశీలన అంటూ తగ్గిస్తూ వెళ్తున్నారు. కూటమి నేతలు హామీ ఇచ్చిన విధంగా అర్హులకు పెన్షన్లు ఇవ్వాలి’ అని వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయేల్ డిమాండ్ చేశారు. ‘జగన్ ముఖ్యమంత్రి అయ్యే సమయానికి 53 లక్షల మందికి పెన్షన్లు ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చే సమయానికి 65 లక్షలకు పెన్షన్లు పెరిగాయి. ఇప్పుడు పెన్షన్లు తొలగిస్తే ఎన్ని తొలగించారు?’ అని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ప్రశ్నించారు. ‘యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కొత్త ప్రభుత్వం వచ్చి 10 నెలలు గడుస్తున్నా ఇంతవరకూ ఏ ప్రతిపాదన చేయలేదు’ అని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేరొన్నారు.
‘ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొలిసారి పెన్షన్లు మొదలుపెట్టారు. 2014లో పెన్షన్ వెయ్యి నుంచి రెండు వేలకు టీడీపీ ప్రభుత్వం పెంచింది. వృద్ధాప్య పెన్షన్లతో పాటు మత్స్యకార, ట్రాన్స్ జెండర్ పెన్షన్లు కూడా ఇస్తున్నాం. కేవలం కాలం చేసిన వారి పెన్షన్లు మాత్రమే తొలగించాం. 50 ఏళ్లకు పెన్షన్లు ఇచ్చేందుకు పరిశీలన చేస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు యాభై ఏళ్లకే పెన్షన్లు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచటానికి ఐదేళ్ల సమయం తీసుకుంది. మేము రాగానే వెంటనే ఒక వెయ్యి పెంచాం’ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు.