Minister Kollu Ravindra: ఏపీలో ఇసుక విధానంలో మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళుతున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గత ప్రభుత్వ తప్పుల వల్ల ఎన్జీటీ పెనాల్టీలు వేసిందన్నారు. అప్పట్లో ప్రభుత్వం మీద ఎన్జీటీ పెనాల్టీలు విధించిందని తెలిపారు. 35 లక్షల టన్నులు పారదర్శకంగా అప్పట్లో మేం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఇచ్చామన్నారు. ఆన్‌లైన్ దళారులు, మాఫియా గత ప్రభుత్వంలో దోచుకున్నారని విమర్శించారు. ఇసుకను ఎడ్లబండ్ల మీద తీసుకెళ్ళే అవకాశం గతంలో ఉండేది కాదని… ఇప్పుడు ఆ అవకాశం ఇచ్చామన్నారు. సీనరేజీ, డీఎంఎఫ్ లాంటివి అన్నీ ఎత్తేశామన్నారు. ఇసుక ఎవరికి వారు సొంతంగా లోడ్ చేసుకోవచ్చని.. సొంత అవసరాలకే వాడుకోవాలన్నారు. బోట్ మేన్ సొసైటీలకు కూడా భూముల విషయంలో అవకాశం ఇస్తామన్నారు. రిజిస్ట్రేషను ఆన్‌లైన్‌లో చేసుకోవడం వ్యక్తి వివరాల కోసం మాత్రమేనన్నారు.
Read Also: Minister Nadendla Manohar: 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు.. సూపర్-6లో తొలి అడుగు..
నిర్మాణ రంగంలో ఎన్నో అవకాశాలు ఉంటాయని.. దానిపై దృష్టి పెట్టామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఎన్విరాన్మెంటల్ కమిటీలను కూడా వినియోగిస్తామన్నారు. బోర్డర్ చెక్ పోస్టులు అత్యంత బలంగా తయారుచేయాలని సీఎం చెప్పారన్నారు. రాష్ట్ర అవసరాలకు మాత్రమే ఎంత ఇసుక అయినా తీసుకెళ్లవచ్చని మంత్రి తెలిపారు. ఇందులో ఎవరైనా అక్రమ రవాణా చేస్తే వారిపై పీడీ యాక్టు పెడతామని హెచ్చరించారు. జగన్ సొంత లారీ తెచ్చుకున్నా ఇసుక తీసుకెళ్ళచ్చని మంత్రి ఎద్దేవా చేశారు.