తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ధాన్యం డబ్బులు రైతులకు ముందు వేయటంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం.. బియ్యం, కందిపప్పు లతో పాటు ఉత్తరాంధ్ర లో రాగులు, జొన్నలు కూడా ఇస్తున్నామని ఆయన తెలిపారు. ధనిక రాష్ట్రమైనా తెలంగాణలో బియ్యం, గోధుమలు మాత్రమే ఇస్తున్నారు.. మా రాష్ట్ర రైతులు అలో లక్ష్మణ అన్నట్లు కేసీఆర్ మాట్లాడుతున్నారు.. కోవిడ్ వచ్చిన సమయంలో తెలంగాణ వదిలి చాలా మంది ఏపీకి వచ్చారు అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు.
Read Also: CM KCR: ముగిసిన రాజశ్యామల యాగం.. మహా పూర్ణాహుతితో పూర్తి
తెలంగాణ సెంటిమెంట్ కోసం సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ సెంటిమెంట్ పాతది అయిపోయింది.. ఇంకా ఏదైనా కొత్తది తెచ్చుకోవాల్సిందే.. చిన్న వర్షానికి హైదరాబాద్ మునిగి పోతుంటే ఏం చేస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి పదేళ్ళు అయినా ఎందుకు కేసీఆర్ ఏమీ చేయలేకపోయారు?.. తెలంగాణలో పేదరికాన్ని తగ్గించలేక పోయారు.. డబ్బులు లేకపోయినా నాలుగున్నర ఏళ్ళల్లోనే సంక్షేమం, అభివృద్ధి అంటే ఏంటో మా సీఎం వైఎస్ జగన్ చేసి చూపించారు అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. ఏపీలో పండుతున్న సన్న బియ్యాన్నే తెలంగాణలో తింటున్నారు అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణలో పండే బియ్యాన్ని తినలేం.. ఏపీ ధాన్యాన్ని ఏపీనే కొంటుంది.. వాళ్ళు ఎక్కువ రేటు పెట్టి కొంటుంటే ఎందుకు కాదంటామని ఆయన పేర్కొన్నారు.