NTV Telugu Site icon

Kakani Govardhan Reddy: సోమిరెడ్డిపై కాకాణి సెటైర్లు.. టికెట్ ఇవ్వకపోతే చంద్రబాబు, పవన్‌పై కూడా ఫిర్యాదు చేస్తారు..!

Kakani

Kakani

Kakani Govardhan Reddy: ప్రభుత్వ అధికారులపై పోలీసులకు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫిర్యాదు చేయడంపై సెటైర్లు వేశారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. అభివృద్ధి. సంక్షేమం ప్రాధాన్యాలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. నెల్లూరు నగరంలో పలు ప్రభుత్వ కార్యాలయాలకు నూతన భవనాలను నిర్మించామని.. కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని కూడా త్వరలోనే చేపడతాం అన్నారు. అయితే, ప్రభుత్వ అధికారులపై పోలీసులకు సోమిరెడ్డి ఫిర్యాదు చేయడం సరికాదని హితవుపలికారు. పొదలకూరులో మైనింగ్ చేస్తున్న వారి నుంచి టన్నుకు రెండు వేల రూపాయలు ఆయన డిమాండ్ చేశారని ఆరోపించారు. అది ఇవ్వనందుకే నానా హడావిడి చేస్తున్నారు.. సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్ లో నా పాత్ర ఉందని ఆరోపించారు.. మరి ఇప్పుడెందుకు ఆ మండలం గురించి మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు.

Read Also: Lok Sabha Election 2024: ఇండియా కూటమిలో సీట్ల పంపకంపై కాంగ్రెస్ కీలక నిర్ణయం

ఇక, వచ్చే ఎన్నికల్లో సర్వేపల్లి అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కూడా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేస్తారు అని ఎద్దేవా చేశారు మంత్రి కాకాణి.. మరోవైపు.. ముత్తుకూరు మండలంలో ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థ యాష్ పాండ్ నిర్మిస్తుంటే హడావిడి చేశారన్న ఆయన.. వాళ్ల నుంచి మామూళ్లు తీసుకున్నారని ఆరోపించారు. ఒక సబ్జెక్ట్ తీసుకుని అందులో తన వాటా వచ్చిన తర్వాత మరో సబ్జెక్టు లోకి వెళ్లడం సోమిరెడ్డికి అలవాటే అని విమర్శలు గుప్పించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.