Kakani Govardhan Reddy: నెల్లూరు జిల్లాలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో ఎంతో హైప్ క్రీయేట్ చేసి ఈ యాత్ర.. నెల్లూరులో అడుగుపెట్టేసరికి యువగళం అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. జిల్లా జనాభాలో కనీసం ఒక శాతం మంది కూడా ఆయనకు స్వాగతం చెప్పేందుకు వెళ్లలేదన్నారు. 2 వేల మంది కూడా ప్రజలు రాలేదని.. కడప జిల్లా వాళ్లు కూడా వీరిలో ఉన్నారన్నారు. యువగళం మూగబోయిందని.. యువగళం వచ్చేవారిని ఎవరూ అడ్డుకోలేదన్నారు. గతంలో ఎందరో నేతలు పాదయాత్ర చేశారని.. రాజశేఖర్ రెడ్డి చేపట్టిన యాత్రకు అపూర్వ స్పందన వచ్చిందన్నారు. దీనిని చూసి చంద్రబాబు పాదయాత్ర చేపట్టి ఎన్నో హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలన్నింటిని విస్మరించారని.. తమను మోసం చేశారని 2019లో చంద్రబాబును ప్రజలు ఘోరంగా ఓడించారన్నారు.
Also Read: Peddireddy Ramachandra Reddy: ఎన్ని రాజకీయ పార్టీలు ఒక్కటైనా ఒంటరిగానే పోటీ చేస్తాం
జగన్ చేపట్టిన పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారన్నారు. ఒక లక్ష్యం ప్రకారం పాదయాత్ర చేశారని మంత్రి చెప్పుకొచ్చారు. “లోకేష్ పాదయాత్రకు ఒక ఉద్దేశం.. లక్ష్యం లేదని ఆయన విమర్శించారు. ఎండగా ఉందని మధ్యాహ్నం దాకా పడుకుంటున్నారు. సెల్ఫీల కార్యక్రమం తర్వాత కొద్దిసేపు వాకింగ్ చేస్తున్నారు. ఒకవైపు లోకేష్ పాదయాత్ర చేస్తుంటే మరోవైపు చంద్రబాబు మేనిఫెస్టోను విడుదల చేశారు. అందులో కూడా కర్ణాటక నుంచి కొన్ని.. వైసీపీ మేనిఫెస్టోలో కొన్నింటిని కాపీ చేశారు. నెల్లూరు జిల్లాలో వైఎస్సార్, జగన్ హయాంలలో జరిగిన పనుల వద్ద లోకేష్ సెల్ఫీ తీసుకోవాలి. సంగం, నెల్లూరు బ్యారేజీలను కూడా చూడాలి. యువగళంలో యువకులు లేరు..అందరూ ముసలివారే.” అని మంత్రి కాకాణి అన్నారు.
Also Read: Botsa Satyanarayana: వారాహి యాత్ర అంటే ఏం అర్థం అవుతుంది?.. పవన్ యాత్రపై బొత్స సెటైర్లు
బీజేపీతో దోస్తీ కట్టడానికి చంద్రబాబు తహతహలాడుతున్నారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో మోడీని చంద్రబాబు తిట్టారని.. మళ్ళీ ఇప్పుడు మోడీ దగ్గరికి వెళ్లాలని బాబు అనుకుంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యతగా మెలుగుతామని జగన్ పలుమార్లు చెప్పారన్నారు. బీజేపీతో ఏ రోజూ వైసీపీ జత కట్టలేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా ఓటుకు నోటు కేసు గురించే కేంద్రంతో చర్చించారన్నారు. పదవి కాపాడుకోవడానికే చంద్రబాబు పడరాని పాట్లు పడ్డారన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం చేపడతామంటే డబ్బుల కోసం తానే నిర్మిస్తానని చంద్రబాబు చెప్పారని మంత్రి చెప్పారు. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీతో పొత్తులో ఉన్నా రాష్ట్రం కోసం ఏమీ సాధించలేదని మండిపడ్డారు. కేంద్రంతో స్నేహపూర్వకంగా మెలుగుతూ నిధులను జగన్ తీసుకొస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దీన్ని చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారన్నారు. 2019 ఎన్నికలప్పుడు మోడీకి వ్యతిరేకంగా ధర్మ పోరాట దీక్షలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు మోడీ వద్దకు వెళ్లి కాళ్లు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని.. జిల్లాలో జగన్ పాదయాత్రను.. యువగళం కార్యక్రమాన్ని బేరీజు వేసి చూడాలన్నారు.
