NTV Telugu Site icon

Jogi Ramesh: నయా పెత్తందార్ల పక్షాన చంద్రబాబు ఆరాటం

Jogi Ramesh

Jogi Ramesh

Jogi Ramesh: పేదలు పేదలుగానే ఉండాలని పెత్తనం తమ చేతుల్లోనే ఉండాలనే స్వభావం చంద్రబాబుది అంటూ ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. అమరావతిలోని మందడం, పెనుమాకలలో టిడ్కో ఇళ్లను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. నయా పెత్తందార్ల పక్షాన చంద్రబాబు ఆరాటపడుతున్నారని.. పేదలకు భూములు ఇవ్వాలని ప్రభుత్వమే పోరాటం చేయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు.

హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు చంద్రబాబు వెళ్లాడని.. అయినా పేదలు, ప్రభుత్వ విధానమే గెలిచిందన్నారు. 51 వేలకు పైగా మందికి రేపు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామన్నారు. వీళ్ళందరికీ ప్రభుత్వం ఇళ్ళు కట్టించి ఇస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉంటే చంద్రబాబుకు అంటరానితనమా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు సమాధి అన్న ఆ సెంటు స్థలంలోనే పేదలు టీడీపీని సమాధి చేయనున్నారని మంత్రి పేర్కొన్నారు.

Read Also: Gautam Adani : ప్రపంచంలోని టాప్- 20 బిలియనీర్ల జాబితాలోకి మళ్లీ గౌతమ్ ఆదానీ

రియల్ ఎస్టేట్ బ్రోకర్ చంద్రబాబు అంటూ విమర్శలు గుప్పించారు. మిమ్మల్ని కోస్తే పసుపు రక్తం వస్తుందా? అంటూ మంత్రి ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ పెద్ద ఎత్తున రేపటి కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రి జోగి రమేష్ విజ్ఞప్తి చేశారు. పనికి మాలిన అమరావతి జేఏసీ ఏం చేస్తుంది? పేద వాళ్ళకు ఇళ్ళ స్థలాలు ఇవ్వొద్దని అడ్డుకుంటుందా? అని ప్రశ్నించారు. జగనన్న కాలనీల్లో 5 లక్షల ఇళ్ళు పూర్తి కానున్నాయని మంత్రి స్పష్టం చేశారు.