Jogi Ramesh: చంద్రబాబు పీ-4 మంత్రం చెబుతున్నారని.. మంత్రాలు కాదు కావాల్సింది, శక్తి యుక్తి కావాలని మంత్రి జోగి రమేష్ విమర్శలు గుప్పించారు. జగన్ పేదవాళ్ల పక్షాన నిలబడతాడు.. పేదలను నిలబెడతారని మంత్రి పేర్కొన్నారు. జగన్ పేదల కోసం మనస్సు పెడతారని ఆయన చెప్పారు. ఇళ్లు కడుతోంటే.. కోర్టులకెళ్లి స్టేలు తెచ్చింది చంద్రబాబు కాదా అంటూ ప్రశ్నించారు. అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని.. ఇప్పుడు ఆయన మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఆరిపోయిన టీడీపీకి చంద్రబాబు అధ్యక్షుడు.. ఆయన జీవితం గురించి ‘ఐటీడీపీ’కి తెలియనట్టుందన్న మంత్రి… ఎన్టీఆర్‌ని ఎలా వెన్నుపోటు పొడిచారో కూడా తెలీదా? అంటూ మంత్రి ప్రశ్నించారు.
రాజధానిలో ఇళ్లు కడుతోంటే కోర్టులకెళ్లినా జగన్ మనస్సు పెట్టి.. ఇళ్లు కడుతున్నారని మంత్రి చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు.. భోగాపురం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు కాదు.. చంద్రబాబా అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. జగన్ కేబినెట్లో ఉన్నందుకు తాము గర్వపడుతున్నామన్నారు మంత్రి జోగి రమేష్. 2014 నాటి టీడీపీ మేనిఫెస్టోలో సంవత్సరానికి 12 సిలెండర్లు ఇస్తానన్నారు.. సబ్సిడీ కూడా ఇస్తానన్నారు.. మరి ఎందుకు ఇవ్వలేదని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. 14,500 కోట్ల డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మహిళలను నిలువునా మోసం చేశారని మంత్రి విమర్శలు గుప్పించారు. హైస్కూల్ పిల్లలకు సైకిళ్లు ఇస్తానని మోసం చేశారన్నారు. నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశారని మంత్రి తెలిపారు. “మొదటి సంతకం చేసిన బెల్టుషాపులు కూడా ఎత్తి వేయలేదు. మంచినీళ్లు ఇవ్వలేదు కానీ ఇంటింటికీ మద్యం సరఫరా చేశారు. ఇప్పుడు కొత్తగా పీ-4 అనే మంత్రం అందుకున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలతాయా చంద్రబాబూ?” అంటూ జోగి రమేష్ దుయ్యబట్టారు.
Read Also: Vidadala Rajini: తప్పిన ప్రమాదం.. లిఫ్టులో చిక్కుకున్న మంత్రి రజనీ, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్
2019 ఎన్నికల్లో కొట్టారు.. 2024 ఎన్నికల్లో కూడా కొడతారని మంత్రి పేర్కొన్నారు. 150 స్థానాలకు పైచిలుకు సీట్లు వైసీపీకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగ లోకం అంతా జై జగన్ అంటూ నినదిస్తున్నారన్నారు. ఉద్యోగుల పట్ల ఇటీవల కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలతో శభాష్ జగన్ అంటున్నారని మంత్రి చెప్పారు.