NTV Telugu Site icon

Jogi Ramesh: పవన్ కల్యాణ్‌కు కనీసం ఏపీలో ఓటు ఉందా?.. మేం కూడా లెటర్ రాయబోతున్నాం!

Jogi Ramesh New

Jogi Ramesh New

గృహ నిర్మాణల భూ సేకరణలో అవినీతి జరిగినట్లు ప్రధానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ లేఖ రాయడంపై గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు కొట్టేసిన స్కిల్ స్కాంలో పవన్ కల్యాణ్‌కు ఎంత ముట్టిందో విచారణ చేయమని తాము కూడా లెటర్ రాయబోతున్నామన్నారు. మనీ లాండరింగ్ ఎలా జరిగిందో విచారణ జరిపించాలని కోరతామని, ఆ ప్రభుత్వంలో పవన్ కూడా భాగస్వామే అని జోగి రమేష్ తెలిపారు.

తాడేపల్లిలో మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ… ‘గృహ నిర్మాణల భూ సేకరణలో అవినీతి జరిగినట్లు ప్రధానికి పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. సీబీఐ, ఈడీ విచారణ కోరారు. 30 లక్షల మహిళలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చి.. ఇళ్ళ నిర్మాణం జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ లేవనెత్తిన 13 అంశాలకు సమాధానాలను మీడియా ద్వారా అందజేస్తున్నాం. పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ డోర్ నెంబర్ ఉందా?, కనీసం ఏపీలో ఓటు ఉందా? లేదా ఆధార్ కార్డ్ ఉందా?. చంద్రబాబు ఇచ్చే డబ్బుల కోసం ఏ గడ్డి అయినా కరవటానికి సిద్ధంగా ఉన్నారు’ అని అన్నారు.

‘మేం కూడా లెటర్ రాయబోతున్నాం. చంద్రబాబు కొట్టేసిన స్కిల్ స్కాంలో పవన్ కల్యాణ్‌కు ఎంత ముట్టిందో విచారణ చేయమని లేఖ రాస్తాం. మనీ లాండరింగ్ ఎలా జరిగిందో విచారణ జరిపించాలని కోరతాం. చంద్రబాబు స్కిల్ స్కాంపై విచారణ చేయమని ఎందుకు లేఖ రాయలేదు?. పేదలకు మూడు సెంట్ల స్థలం ఇస్తామని హామి ఇచ్చాం.. ఎందుకు నెరవేర్చ లేదు అని చంద్రబాబును ప్రశ్నించావా?. ప్రజలను మోసం చేసిన ప్రభుత్వంలో పవన్ కూడా భాగస్వామి కదా. పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లులు ఇస్తుంటే ఎందుకు మీకు అంత కడుపుమంట?. ప్రతి గ్రామాన్ని జగన్ అభివృద్ధి చేస్తుంటే.. ప్రధానికి లేఖ రాస్తాడట. చంద్రబాబు, లోకేష్ దోచుకున్న డబ్బుల మీద లేఖ రాయి’ అని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు.

Also Read: Leopard in Srisailam: శ్రీశైలంలో చిరుతపులి సంచారం.. భయాందోళనలో స్థానికులు, భక్తులు!

‘ఆ పాపంలో పవన్ కల్యాణ్‌కు భాగస్వామ్యం ఉంది. వీరి పాపం పండింది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేదు?, ఫ్రీ బస్సు ప్రయాణం ఎందుకు ఇవ్వలేదు. ప్రజలు ఆ గ్యాస్ సిలెండర్ పట్టుకునే కొడతారు. ఎంత మంది ఎన్ని పొత్తులు పెట్టుకున్నా.. జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరూ ఆపలేరు’ అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు.