సైనికుల నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా యువత విధ్వంస చర్యలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో అగ్నిపథ్‌పై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. అగ్నిపథ్‌తో ఆర్మీ ఉద్యోగాలకు కేంద్రం మంగళం పాడుతోందని ఆయన ఆరోపించారు. దాడుల వెనుక ఇక్కడ టీఆర్ఎస్ హస్తం ఉంటే.. యూపీలో ఎవరి హస్తం ఉన్నట్లు అని ఆయన ఎద్దేవా చేశారు. బండి సంజయ్, డీకే అరుణలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నిపథ్‌ను మార్చాలని అడిగితే యువకులను కాల్చి చంపుతున్నారని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో రూ.37 కోట్ల వ్యయంతో చేపట్టిన వంద పడకల దవాఖాన నిర్మాణానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి హరీశ్ మాట్లాడారు.
బీజేపీ మాటలు తీయగా ఉన్నాయన్న హరీశ్.. చేతలు మాత్రం చేదుగా ఉన్నాయన్నారు. అగ్నిపథ్ యువతకు అర్థం కాలేదు అనడం హాస్యాస్పదమన్నారు. కేంద్రం నిర్ణయంతో దేశంలో అగ్గి అంటుకుందన్న మంత్రి.. బీజేపీ ప్రతి ఒక్కరి ఉసురు పోసుకుంటోందన్నారు. ఆర్మీలో కాంట్రాక్టు ఉద్యోగాలు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. శుక్రవారం పిల్లలు అడగడానికి వెళ్తే కాల్చి చంపారని అన్నారు. యువకుల బాధ బీజేపీ నేతలకు అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు.
Agnipath Protest: రాకేశ్ అంతిమ యాత్రలో ఉద్రిక్తత.. రాళ్ళదాడి