Minister Gudivada Amarnath: సీఎం విశాఖకు రాకపై మంత్రి అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దసరా పండగ రోజున విశాఖ ప్రజలకు బ్రహ్మాండమైన కానుక ఉంటుందని ఆయన తెలిపారు. విశాఖ ప్రజలు ఎదురు చూస్తున్న కల దసరాతో తీరుతుందని పేర్కొన్నారు. అటు పార్టీని వీడిన నాయకులపై మంత్రి అమర్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడి చేసి, జగన్‌ను సీఎంను చేయాలని తపించిన వ్యక్తులు ఎవరూ కూడా వైసీపీని వీడి బయటకు వెళ్లలేదన్నారు. అవసరం, అధికారం, పదవులు, భవిష్యత్తు కోసం వచ్చిన వాళ్లే పార్టీ నుంచి వెళ్లిపోయారని మంత్రి అమర్‌నాథ్ మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి అన్యాయం చేసిన నలుగురు ఎమ్మెల్యేలపై వేటేసిన ధైర్యం జగన్ మోహన్ రెడ్డిది అని మంత్రి గుడివాడ అన్నారు. ముందు నుంచి పార్టీ కోసం పని చేసిన వాళ్లకు, జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకున్న వాళ్ళకు అన్యాయం జరగదని మంత్రి స్పష్టం చేశారు. విశాఖ జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా కోలా గురువులు బాధ్యతలు స్వీకరించారు. ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ నాథ్, మాజీమంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్ విశాఖ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: AP High Court: రుషికొండపై నిర్మాణాలు.. హైకోర్టు కీలక ఆదేశాలు
కాగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులను ప్రకటించిన విషయం తెలిసిందే. కర్నూలు న్యాయ రాజధాని, అమరావతి శాసన రాజధాని, విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించారు. అయితే సీఎం జగన్ కూడా విశాఖకు షిఫ్ట్ అవుతానని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయంతో పాటు సీఎంవోను కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ దసరాకు విశాఖకు సీఎం వెళ్తారని అటు మంత్రులు సైతం చెప్పారు. ఇందులో భాగంగా మంత్రి అమర్‌నాథ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. “వైసీపీని నమ్ముకున్న వారికి అన్యాయం జరగదు. దీనికి నిదర్శనం కోలా గురువులే. చట్టసభలో కూర్చోబెడతానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. చంద్రబాబు కుట్రలతో గురువులు ఓడిపోయారు. మత్స్యకారుడిని రాజ్యసభకు పంపిన చరిత్ర జగన్ ది. సీఎం జగన్ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పరిపాలన రాజధానికి అధ్యక్షుడిగా గురువులను సీఎం జగన్ నియమించారు. కచ్చితంగా గురువులను చట్టసభలో సీఎం జగన్ కూర్చోబెడతారు.” అని పేర్కొన్నారు.
