Minister Gottipati Ravi: బాపట్ల జిల్లా రామాపురం బీచ్‌లో వరుస ప్రమాదాలపై జిల్లా మంత్రి గొట్టిపాటి రవి సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడారు. వరుస ప్రమాదాలు జరుగుతూ ముక్కుపచ్చలారని యువకులు చనిపోతుంటే ఎందుకు నష్ట నివారణ చర్యలు చేపట్టట్లేదని అధికారులను మంత్రి నిలదీశారు.అందుబాటులో తక్షణమే గజఈతగాళ్లను పెట్టడంతో పాటు ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందుకు మెరైన్ పోలీసుల సాయమూ తీసుకోవాలని సూచించారు.
Read Also: Viral video: రీల్స్ కోసం బరితెగింపు.. సముద్రంలోకి వాహనాలు తీసుకెళ్లి ఏం చేశారంటే..!
నెలరోజుల వ్యవధిలో ఎన్నో ఘటనలు జరిగి ప్రాణాలు పోతుంటే ఇంతవరకు ఎందుకు అలసత్వం వహించారని మంత్రి మండిపడ్డారు. సమీపంలో రిసార్ట్స్ ఉండటంతో విహారయాత్రకు వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారని గొట్టిపాటి రవికి అధికారులు వివరించారు. రిసార్ట్స్ యాజమాన్యం కూడా ప్రమాదాల నివారణకు బాధ్యత తీసుకునేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పోలీస్, రెవెన్యూ, పర్యాటక, ఇతర శాఖల అధికారులతో పాటు రిసార్ట్స్ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి ప్రమాదాలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని మంత్రి గొట్టిపాటి రవి ఆదేశించారు.