రైతుల వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ఉద్దేశ్యం తమ ప్రభుత్వానికి లేదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో కూడా రైతులకు స్మార్ట్ బిగించటం లేదని చాలాసార్లు చెప్పామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల నుంచి తగ్గిస్తున్నామని ప్రచారం పెట్టారని, ఇందులో నిజం లేదన్నారు. కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయన్నారు. సీఎం చంద్రబాబును చూసి ఏపీలో కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపిస్తున్నారని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు.
‘కూటమి ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను తీసుకువస్తోంది. సీఎం చంద్రబాబును చూసి ఏపీలో కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల పీఆర్సీ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తాం. సీఎం నుంచి ఉద్యోగుల పీఆర్సీపై ఓ మంచి వార్తను వింటామని ఆశిస్తున్నాం. గతంలో పలుసార్లు ఉద్యోగుల సమస్యలపై సీఎం స్పందించారు. విద్యుత్ ఉద్యోగులు ప్రాణాలను ఎదురొడ్డి ఉద్యోగం చేస్తారు. విద్యుత్ ఉద్యోగులు విపత్కర సమయాల్లో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారు. ప్రతీ యేటా ఆరు నుంచి ఏడు శాతం విద్యుత్ వినియోగదారులు పెరుగుతున్నారు’ అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
Also Read: Davos Tour: దావోస్‌లో రెండోరోజు సీఎం చంద్రబాబు పర్యటన.. 15కు పైగా సమావేశాలతో బిజీబిజీ!
‘రైతులకు వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించటం లేదు. అసెంబ్లీలో కూడా రైతులకు స్మార్ట్ మీటర్లు బిగించటం లేదని చాలాసార్లు చెప్పాం. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల నుంచి తగ్గిస్తున్నామని ప్రచారం పెట్టారు, ఇందులో నిజం లేదు. కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయ అవసరాల కోసం ఇలాంటి ప్రచారాలు రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదు. ఏపీకి పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. పవర్ రిఫార్మ్స్ లో కొత్త పెట్టుబడులు వస్తున్నాయి. చంద్రబాబు నాయకత్వంలో పరిశ్రమలు పెట్టేందుకు దావోస్ పర్యటనలో పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు’ అని మంత్రి గొట్టిపాటి చెప్పుకొచ్చారు.