Errabelli Dayakar Rao: ప్రధాని మోదీ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. రైతులపై విద్యుత్ భారం పెంచుతామంటే వ్యతిరేకించాం తప్ప, కేంద్రానికి అన్ని విషయాల్లో సహకరించామని ఆయన తెలిపారు. సహకరించలేదని మోడీ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. 9 ఏళ్ల పాటు కేంద్రానికి సహకరించామని.. ఏ బిల్లు పెట్టినా ఓటేశామన్నారు. దేశంలో లాభాల బాటలో ఉన్న సంస్థ తెలంగాణలోని సింగరేణి అని.. ఆ సంస్థను ప్రైవేటుపరం చేస్తాం అంటే చూస్తూ ఊరుకోమన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటామని, అవసరమైతే మోడీని గద్దె దించుతామన్నారు.
Read Also: Andhra Pradesh: ఏపీలో అరుదైన మూలకాలు.. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కనుగొన్న శాస్త్రవేత్తలు..
రైతులపైన విద్యుత్ భారం మోపుతామంటే వ్యతిరేకించామని ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకపోవడంతో వ్యతిరేకించామని.. ఆ చట్టంలోని హామీలను అమలుచేయని వారికి ఎలా సహకరించాలని ప్రశ్నించారు. మన డబ్బులు తీసుకొని వేరే రాష్ట్రాల్లో ఖర్చు పెట్టినందుకు సపోర్టు చేయాలా అని ఎర్రబెల్లి ప్రశ్నలు కురిపించారు. గ్యాస్, పెట్రోల్ రేట్లు, నిత్యావసర వస్తువుల రేట్లు పెంచినందుకు సపోర్టు చేయాలా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని.. వారికి కుటుంబ విలువులు తెలియవన్నారు. ఉద్యమంలో కీలకంగా పోరాడిన కుటుంబంపై నిందలు వేస్తున్నారని ఆయన అన్నారు. ప్రధానిగా మోడీకి గౌరవం ఇస్తాం కానీ కేటీఆర్, కేసీఆర్‌ని టార్గెట్ చేస్తూ అభాసుపాలు చేస్తే ఊరుకోమన్నారు.
