NTV Telugu Site icon

Botsa Satyanarayana: సీఎం జగన్‌కు మంత్రి బొత్స కృతజ్ఞతలు.. అందుకే చంద్రబాబుకు కడుపు మంట..!

Botsa Satyanarayana

Botsa Satyanarayana

Botsa Satyanarayana: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంఖుస్థాపన చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ఇంత అద్భుతమైన కార్యక్రమం జరిగితే ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కడుపు మంటగా ఉంది అంటూ ఫైర్‌ అయ్యారు.. వైఎస్‌ జగన్ ప్రతిపక్ష నేతగా చేసిన పోరాటం వల్లనే చంద్రబాబు 2,300 ఎకరాల భూ సేకరణకు కుదించారన్న ఆయన.. ఇది వాస్తవం కాదా? భోగాపురం విభజన చట్టంలో ఉన్న విమానాశ్రయం కాదా? ఆ రోజు టీడీపీ నేత, కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజు ఎందుకు హాజరు కాలేదు? ప్రజల నుంచి తిరుగుబాటు ఉంటుందని భయపడే దాక్కున్నాడు అన్నది వాస్తవం కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.. ఇక, చంద్రబాబు ఏం పని చేసినా రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.

Read Also: CM YS Jagan: రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం జగన్‌..

మరోవైపు, సిట్‌ ఏర్పాటుపై ఏపీ హైకోర్టు స్టేను ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై స్పందించిన మంత్రి బొత్స.. నాలుగు రోజులు ఆగితే అన్ని బయటకు వస్తాయి.. ఏం తప్పు చేయకపోతే కోర్టులకు వెళ్లి స్టేలు ఎందుకు తెచ్చుకుంటున్నారు? అని ప్రశ్నించారు.. ఒకవైపు కోర్టు కేసులు వేస్తూ మరోవైపు ఏం చేయలేకపోయారు అనే రాగాలు ఎందుకు? అని ఎద్దేవా చేశారు మంత్రి బొత్స సత్యానారాయణ. కాగా, బుధవారం నాడు భోగాపురం ఎయిర్ పోర్టుకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేసిన విషయం విదితమే.. 2026లో ఈ ఎయిర్ పోర్టును తాను ప్రారంభించనున్నట్టుగా ఆశాభావం వ్యక్తం చేశారు. మెడికల్, టూరిజం, ఐటీ, ఇండస్ట్రీకి భోగాపురం కేంద్ర బిందువుగా మారనుందన్న ఆయన.. గతంలో చంద్రబాబు ఎన్నికలకు రెండు మాసాల ముందు హడావుడిగా శంకుస్థాపన చేశారని విమర్శించారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు ఎలాంటి అనుమతులు తీసుకొకుండానే శంకుస్థాపనలు చేశారని ఆరోపించారు. కానీ, తమ ప్రభుత్వం భోగాపురం ఎయిర్ పోర్టుకు అన్ని రకాల అనుమతులు తీసుకుందని ఆయన గుర్తు చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టు పనులకు ఆటంకం కల్గించేందుకు కోర్టుల్లో కేసులు వేశారంటూ పరోక్షంగా టీడీపీ నేతలపై సీఎం వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.